రెండు దశాబ్దాల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు పాటించని కేసులో సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించడంపై కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్)లో అప్పీలు చేసుకున్నారు. 1994లో కన్వర్టబుల్ వారెంట్లతో డిబెంచర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ జారీ చేసింది. 2000 సంవత్సరంలో వారెంట్లకు ఈక్వీటీ షేర్లను కేటాయించింది. అవిభజిత రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ధీరూభాయ్ అంబానీ నడిపించిన సమయంలో ఇది జరిగింది.
అంబానీ కుటుంబంపై..
టేకోవర్ నిబంధనల ఉల్లంఘనపై 2011లో ఫిబ్రవరిలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు సెబీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తాజగా ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, మరికొందరు వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. ఈ జాబితాలో ముకేశ్ భార్య నీతా; అనిల్ భార్య టీనాలూ ఉన్నారు. సెబీ టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించలేదని, శాట్‌లో వాదన వినిపిస్తామని ఎక్సేంజీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సమాచారమిచ్చింది.
ఇదీ నేపథ్యం..
ఆర్‌ఐఎల్ ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్కన్సర్ట్(పీఏసీ)లు 2000 సంవత్సరంలో సంస్థలో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు అంశాన్ని బయటకు వెల్లడించడంలో విఫలమయ్యారని సెబీ తన 85 పేజీల ఆదేశంలో పేర్కొంది. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని 2005లో ముకేశ్, అనిల్‌లు పంచుకున్న సంగతి తెలిసిందే. పీఏసీతో కలిసి ప్రమోటర్లు ఆర్‌ఐఎల్‌లో జనవరి 7, 2000లో 6.83 శాతం వాటా కొనుగోలు చేశారు. 5 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేస్తే ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే అలా జరగలేదని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సంయుక్తంగా రూ.25 కోట్ల అపరాధ రుసుమును విధించింది.
ఇవీ చదవండి: రిలయన్స్, ఫ్యూచర్ ఒప్పందానికి 6 నెలలు గడువు