మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనను సీఈఓ, ఎండీ పదవుల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ కొచ్చర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
"సారీ.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేం జోక్యం చేసుకోలేం. ఇది ప్రైవేటు బ్యాంకుకు, ఉద్యోగికి మధ్య జరిగిన ఒప్పందం పరిధిలోకి వస్తుంది"
- జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం
తొలుత చందాకొచ్చర్ ఈ విషయమై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎండీ, సీఈఓ పదవుల నుంచి తప్పిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అక్కడ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. "ఇది ప్రైవేటు ఒప్పందం కనుక ఇందులో మేం జోక్యం చేసుకోబోం" అని చెబుతూ ఈ ఏడాది మార్చి 5న చందాకొచ్చర్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొచ్చర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆమెకు నిరాశే మిగిలింది.
ఇదీ కేసు..
వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1875 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డ అభియోగాలపై చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌పై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రావడం వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ చర్యలు చేపట్టింది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. అనంతర పరిణామాల్లో చందా కొచ్చర్‌ను తన పదవుల నుంచి తొలగించింది. మనీలాండరింగ్ అభియోగాలపై దీపక్ కొచ్చర్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ఈడీ అరెస్టు చేసింది.