గృహ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) ఇచ్చే రుణాలను రెపో రేటును అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి.. రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.
వ్యక్తిగత, రిటైల్, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలకు రెపో రేటును అనుసంధానం చేయాలని సెప్టెంబర్ 4న రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
రెపో రేటు ఆధారంగా రుణాలపై వడ్డీ సవరణ కాకుండా 3 లేదా 6 నెలల ట్రెజరీ బిల్లు ఆధారంగా గానీ, ఫినాన్షియల్ బెంచ్మార్క్ ఇండియా ప్రచురించిన ప్రామాణిక రేటుకు అనుగుణంగా గానీ వడ్డీ రేట్లు సవరించేందుకు బ్యాంకులకు అవకాశం ఇచ్చింది ఆర్బీఐ.
తొలుత జులై 1 నుంచే ఈ నిబంధనను అమలు చేయాలని భావించింది ఆర్బీఐ. అయితే కొన్ని సవరణలు చేసి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఇటీవల సూచించింది.
ఇదీ చూడండి: రెండు రోజుల్లో రూ.10.50 లక్షల కోట్ల సంపద వృద్ధి!