బ్రాడ్‌బాండ్, డీటీహెచ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని భావిస్తున్న 'జియో గిగా ఫైబర్' ఆవిష్కరణ నిరీక్షణకు త్వరలో తెరపడనుందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి పలు నివేదికలు. వీటి ప్రకారం ఆగస్టు 12న జియో గిగా ఫైబర్ వాణిజ్య సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. అదే రోజు జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. గిగా ఫైబర్ వాణిజ్య సేవల ఆవిష్కరణకు ఇదే సరైన సమయమని రిలయన్స్ భావిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది సర్వసభ్య సమావేశంలో 'జియో గిగా ఫైబర్' సేవలపై ప్రకటన చేసింది రిలయన్స్. తక్షణమే దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో గిగాఫైబర్ కోసం నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయా పట్టణాల్లో సంస్థ ఉద్యోగులతో ట్రయల్ నిర్వహిస్తోంది.
గత వారం కీలక ప్రకటన
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను గత వారం ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో 'జియో గిగాఫైబర్' బీటా ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్లు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
జియో గిగాఫైబర్ ప్లాన్లు ఇవే..
ట్రయల్ దశలో పలు పట్టణాల్లో రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో గిగాఫైబర్ సేవలను అందిస్తోంది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్‌తో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. మొదట ఈ ప్లాన్‌ను రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేసినా.. తర్వాత బీటా టెస్టింగ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
'ట్రిపుల్ ప్లే' ప్లాన్‌లోని వినియోగదారులు డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ సేవలను పొందుతున్నారు. రూ.2,500తో మరో ప్లాన్‌ను తెచ్చింది జియో. ఈ ప్లాన్‌లో 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో గిగా ఫైబర్ సేవలను అందిస్తోంది.
ట్రిపుల్ ప్లే ప్లాన్‌కు నెలవారీ చందా రూ.600 ఉండనున్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం రూ.1,000 నెలవారీ చందాతో మరో ప్లాన్‌ను కూడా తీసుకురానుంది రిలయన్స్.
ఇదీ చూడండి: దేశంలో నల్లధనం ఎంతో తెలీదు: కేంద్రం