రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి రాణించింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది.
చమురు, పెట్రోకెమికల్ రంగాల్లో ఆశించిన లాభాలు రాకున్నా.. రిటైల్, టెలికాంలలో మెరుగైన ఫలితాలు రికార్డు స్థాయి లాభాలకు కారణం. జనవరి-మార్చి క్వార్టర్లో సంస్థ నికర లాభం రూ. 10 వేల 362 కోట్లుగా వెల్లడించింది రిలయన్స్.
2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నమోదైన నికరలాభం రూ. 9 వేల 438 కోట్ల కంటే ప్రస్తుతం 9.8 శాతం పెరుగుదల కనిపించింది.
సంస్థ ఆదాయం 19.4 శాతం వృద్ధితో లక్షా 54 వేల 110 కోట్ల రూపాయలకు చేరుకుంది.
చిల్లరవర్తకం వ్యాపారంలో 77 శాతం వృద్ధితో రూ. 1923 కోట్లకు చేరింది. టెలికామ్ రంగంలో 78.3 శాతం పెరుగుదల కనిపించింది.
రిలయన్స్ జియోకూ భారీ లాభాలు
టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కూడా 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంతకుముందటి ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే.. 64.7 శాతం అధిక లాభాలను గడించింది. నికరలాభం రూ. 840 కోట్లుగా పేర్కొంది. 2017-18లో ఈ సంఖ్య రూ. 510 కోట్లుగా ఉంది.
రెవెన్యూ.. 55.8 శాతం పెరిగి రూ. 11 వేల 106 కోట్లకు చేరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 7, 128 కోట్లు గానే ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి: భారీగా లాభాల స్వీకరణ... రికార్డులకు గండి