ఓ వైపు అన్న ముకేశ్ అంబానీ తన గ్రూప్‌ను రుణ రహిత సంస్థగా మార్చగా.. తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అదే అప్పుల్లో కూరుకుపోవడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే.. అన్న అప్పులు తీరడానికి టెలికాం సంస్థ జియో కారణంగా కాగా.. తమ్ముడు అప్పులకు కారణం ఆయన టెలికాం కంపెనీ ఆర్‌కామ్ కావడం. ఇటీవలే తన సంపద సున్నా అని కోర్టుల్లో చెప్పుకునే పరిస్థితి తమ్ముడిది.
అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు డిసెంబరు 31, 2019 నాటికి రూ.43,800 కోట్ల రుణాలున్నాయి. అందులో ఒక్క రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఒక్కదానికే రూ.32,575 కోట్ల అప్పులుండడం గమనార్హం. అంతక్రితం ఇంకా ఎక్కువ రుణాలే ఉన్నప్పటికీ.. అన్న ముకేశ్‌కు టెలికాం టవర్లను విక్రయించడం ద్వారా కొంత తీర్చుకోగలిగారు.
ఎక్కడ నుంచి ఎక్కడికి..
2008లో అనిల్ అంబానీ ప్రపంచంలోనే ఆరో అత్యధిక ధనవంతుడు. అప్పడు ఆయన సంపద 42 బిలియన్ డాలర్లుగా ఉండేది. సరిగ్గా.. 12 ఏళ్ల తర్వాత లండన్ కోర్టులో తన సంపద ‘సున్నా’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంబానీ సోదరులు విడిపోయాక అనిల్‌కు టెలికాం, విద్యుదుత్పత్తి, ఆర్థిక సేవల వ్యాపారాలు దక్కాయి. అయితే అవన్నీ రుణాల్లో కూరుకుపోయాయి. కొన్ని అయితే దివాలా కోర్టులోకీ వెళ్లాల్సి వచ్చింది.
మార్కెట్ విలువ రూ.1600 కోట్లే
ఇక జూన్ 2019న అనిల్ అంబానీ రియలన్స్ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ వాటా రూ.6,196 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 10, 2020 నాటికి అది కాస్తా రూ.1,645.65 కోట్లకు చేరింది. ఒకప్పటి కుబేరుడైన అనిల్ ఇపుడు మూడు చైనీస్ బ్యాంకుల నుంచి దావా ఎదుర్కొంటున్నారు. 2012లో ఆర్‌కామ్‌కిచ్చిన 680 మిలియన్ డాలర్ల రుణాలను తిరిగి తీసుకునే పనిలో అవి ఉన్నాయి. అయితే ఆస్తులను అమ్మి అప్పులు తీర్చడానికి తన వద్ద ఎటువంటి అర్థవంతమైన ఆస్తులు లేవని ఇటీవలే అనిల్ కోర్టుకు చెప్పడం చూస్తుంటే అన్నదమ్ముల ఆస్తుల మధ్య ఎంత అంతరం ఉందో అర్థమవుతోంది.
ఆర్‌కామే కారణం
2002లో రిలయన్స్ ఇన్ఫోకామ్ పేరుతో ఆర్‌కామ్ సేవలు ప్రారంభించినపుడు సీడీఎమ్‌ఏ ప్లాట్‌ఫాంను నమ్ముకుంది. 4జీ వచ్చినపుడు సీడీఎమ్‌ఏ దానికి సపోర్ట్ చేయలేకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ముకేశ్ టెలికాం వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో అనిల్‌తో పాటు ఇతర కంపెనీలకూ తీవ్రమైన దెబ్బ తగిలింది. 2017లో ఆర్‌కామ్ తన కొట్టుమూసుకోవాల్సి వచ్చింది. 2018లో దివాలా ప్రక్రియ కూడా మొదలైంది.
ఇదీ చూడండి: ఇక రుణ రహితంగా అంబానీ సామ్రాజ్యం