ఆర్బీఐ నేతృత్వంలో ద్రవ్య విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) చివరి రోజు భేటీపై ఇటు మార్కెట్, అటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆర్బీఐ రెపో రేట్లపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నాయి.
వడ్డీ రేట్లు మారతాయా? తటస్థంగా ఉంటాయా?
దేశీయంగా, అంతర్జాతీయంగా చూస్తే ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతోంది. ఆర్థిక గణాంకాలు చూస్తే.. 2018-19 చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.8 శాతంతో ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వీటితో పాటు టోకు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యానికి లోబడే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వృద్ధికి ఊతమందించే దిశగానే ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం ఉండొచ్చని.. పలు నివేదికలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నివేదికలు కీలక వడ్డీ రేట్ల కోత 25-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి.
ఇప్పటికే వరుసగా రెండు ద్వైమాసిక ఎంపీసీ సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్ల కోత విధించింది ఆర్బీఐ.
రుతుపవనాల ఆలస్యం సహా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని కొంత మంది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
అయితే, మెజారిటీ ఆర్థిక వేత్తలు మాత్రం రేట్ల కోత కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయపడుతున్నారు.
స్టాక్ మార్కెట్లు ఎటు?
ఎంపీసీ సమావేశం దృష్ట్యా నేడు మదుపరులు అప్రమత్తమగా వ్యవహరించొచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒక వేళ అనుకున్నట్లుగానే వడ్డీ రేట్లు తగ్గితే సూచీలు దూసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గుతాయనే అశతో సోమవారం జీవనకాల గరిష్ఠాలను తాకాయి సూచీలు. అయితే మంగళవారం వడ్డీ రేట్ల కోతపై వచ్చిన మిశ్రమ స్పందనల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఫలితంగా నష్టాల్లో ముగిశాయి.