దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ ఈ-స్కూటర్లను అంతర్జాతీయ మార్కెట్లలోనూ విక్రయించనున్నట్లు సంస్థ ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో తమ ఈ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ-స్కూటర్లే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి భవిష్యత్‌లో విద్యుత్ కార్లు కూడా వచ్చే అవకాశముందని ఆయన సంకేతాలిచ్చారు.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి తొలి ఈ-స్కూటర్ ఈ ఏడాది జులైలో భారత్‌లో విడుదలకానుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తమ ఈ-స్కూటర్‌కు సంబంధించిన ధర, ఫీచర్ల వంటి వివరాలు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు.
అంతర్జాతీయంగా పెద్ద మార్కెట్లన్నింటిలో ముఖ్యంగా ఐరోపా దేశాల్లో తమ ఈ-స్కూటర్లకు మంచి మార్కెట్ ఉంటుందని భవిష్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తమ ప్రథమ ప్రాధాన్యత భారత్‌కే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: