కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్లో సరికొత్త పద్ధతికి భారత్ బయోటెక్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తొలి డోసు కొవాగ్జిన్, రెండో డోసు కింద నాసికా వ్యాక్సిన్ (Covaxin nasal spray vaccine) ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. రెండో డోసు నాసికా వ్యాక్సిన్ ఇస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వీలుంటుందని తెలిపారు. అప్పుడు మాస్కులు వాడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
'ఇండియా-గ్లోబల్ వ్యాక్సిన్ ఇంజిన్' అన్న అంశంపై టైమ్స్‌నౌ ఛానల్ బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నాసికా టీకా (నాసల్ వ్యాక్సిన్) బూస్టర్ డోస్‌గా (Covid booster dose India) చక్కగా పనిచేస్తుందని, దానివల్ల వైరస్ వ్యాప్తి నిరోధం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాసికా టీకా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
"సూది మందు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌తో ఊపిరితిత్తుల పైభాగానికి రక్షణ ఉండదు కాబట్టి మాస్క్ ధరించాలి. నాసికా వ్యాక్సిన్ ఆ భాగానికీ రక్షణ కల్పిస్తుంది. నాసికా వ్యాక్సిన్‌ను వైరస్ సోకని వ్యక్తికి ఇస్తే అది సరిగా పనిచేయదు. కానీ ఇన్‌ఫెక్షన్ గురైన వ్యక్తికి గానీ, తొలి డోసు తీసుకున్న వ్యక్తికి గానీ ఇస్తే అది బాగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ రోగ నిరోధకశక్తి (ఇమ్యునాలజీ)ని ప్రపంచంలో తొలిసారి కనుగొన్న సంస్థ మాదే. ఇప్పటికే ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నాసికా వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుంది. కరోనాను నిరోధించాలంటే నాసికా వ్యాక్సిన్ తప్ప ఇంకో మార్గం లేదు. మేం దీని రెండో దశ పరీక్షలు పూర్తిచేశాం. ఫలితాల విశ్లేషణ జరుగుతోంది. 3-4 నెలల్లో దాన్ని ఆశించవచ్చు."
-కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ సీఎండీ
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం మేలని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. కొవాగ్జిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల తర్వాత కూడా టీ సెల్ స్పందన కనిపిస్తోందని, ఇది అమెరికాలో అందించే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల కంటే మేలైన పనితీరు కనబరుస్తోందని పేర్కొన్నారు.
కొవాగ్జిన్‌పై తొలుత దుష్ప్రచారం జరిగింది. వీటిని ఎలా అధిగమించారు?
మేం తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో అయిదింటికి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు ఉంది. ఆ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది మాకు తెలుసు. కొన్ని ప్రసార మాధ్యమాలే వ్యతిరేకంగా రాశాయి. అలాంటి వాటి వల్ల అనుమతుల ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం వల్ల చివరకు ఆటలో గెలిచాం. ప్రధాన మంత్రి కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే అది మోదీ, భాజపా వ్యాక్సిన్ అని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలుగా మేం రాజకీయాలను అర్థం చేసుకోలేం. మాపై చేసిన ప్రచారం మమ్మల్ని బాధించడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే స్టార్టప్స్‌కు అడ్డంకిగా తయారైంది. ఎవరైనా మిగతా విషయాలపై రాజకీయాలు చేయొచ్చు కానీ వైద్య ఆరోగ్యంపై మాత్రం కాదు.
ప్రతికూల ప్రచారం వల్ల ఎలాంటి ప్రభావం పడింది?
దేశంలో చేసిన ప్రతికూల ప్రచారం డబ్ల్యూహెచ్‌ఓనీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. తాము చేస్తున్నది తప్పా, ఒప్పా అని నిర్ధరించుకునేందుకు వారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూసి సూక్ష్మంగా పరిశీలించాల్సి వచ్చింది. మాలాంటి పరీక్షలను ఎవ్వరూ ఎదుర్కోలేదు. చివరికి మేమే నెగ్గాం. ఎక్కువ మంది సవాళ్లు విసరడం మాకే మేలు చేసింది. మిగతావారి కంటే ఉత్తమంగా నిలవడానికి దోహదపడింది.
మాకు మంచి చరిత్ర ఉంది
మేం ఇదివరకే కొవాగ్జిన్ కంటే ఉత్తమమైన, ప్రపంచంలో మొట్టమొదటి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను రూపొందించాం. దురదృష్టవశాత్తు దాని గురించి మీడియా పట్టించుకోలేదు. ఉత్తమ వ్యాక్సిన్ల రూపకల్పనలో మాకు మంచి చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గర్భిణులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చింది భారత్‌లోనే. అందులో దాదాపు పది లక్షల మందికి కొవాగ్జిన్ ఇచ్చారు. గర్భిణులకు ఈ వ్యాక్సిన్ సురక్షితమని తేలింది. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం క్లినికల్ మోడ్‌లో ఈ విషయాన్ని నిరూపించాల్సిందిగా సూచిస్తోంది. మరో రెండుమూడు నెలల్లో ఆ పని పూర్తిచేస్తాం. మాది ఉత్తమమైన సైన్స్ అని మరోసారి నిరూపించుకుంటాం.
పిల్లల టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
2 నుంచి 18 ఏళ్ల వారిలో క్లినికల్ పరీక్షలు నిర్వహించిన ఏకైక వ్యాక్సిన్ ప్రపంచంలో మాదే. వివరాలను ఔషధ నియంత్రణ జనరల్ ఆమోదం కోసం పంపాం. భారతీయ సంస్థ అనుమతులు ఇచ్చేంతవరకు పిల్లల టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతిచ్చే అవకాశం లేదు. మూడేళ్లకుపైగా వయసున్న పిల్లలకు టీకా అనుమతుల కోసం చైనా దరఖాస్తు చేసుకొంది. ఈ విషయంలో మాకు పోటీ ఎదురవుతోంది. ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అవి వచ్చిన రెండు మూడు నెలల్లోనే మొత్తం పిల్లలకు అందించడం సాధ్యం కాదు. అనుమతులు ఆలస్యం చేస్తే మిగతా ప్రపంచ దేశాలకు వెళ్లే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మేం ఏటా 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నాం. మూడు ప్రభుత్వరంగ సంస్థలు, ఒక ప్రైవేటు సంస్థతో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఒప్పందం చేసుకున్నాం. మేం ఆశించిన స్థాయికి వారు చేరుకోలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ కొవాగ్జిన్ తీసుకోవడంపై మీ స్పందన...?
దేశ ప్రధాని మా వ్యాక్సిన్ తీసుకోవడం మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. భారతీయ శాస్త్రవేత్తలపై, స్టార్టప్స్‌పై ఉన్న నమ్మకానికి అది అద్దంపట్టింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో మేం ఏ ప్రక్రియనూ తగ్గించలేదు. ఏ నిబంధనా ఉల్లంఘించలేదు. ఆ పనిచేసి ఉంటే నేను జైలుకు వెళ్లి ఉండేవాణ్ని. భారతీయ చట్టాలను 100% అనుసరించాం. ఇక్కడ వేగం పుంజుకొన్నది అనుమతుల ప్రక్రియ మాత్రమే. ఇదివరకు నాలుగైదునెలలు పట్టే అనుమతులు ఇప్పుడు నాలుగైదు రోజుల్లోనే వచ్చాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలను ప్రధానమంత్రి సందర్శించడం.. నియంత్రణ వ్యవస్థ పనితీరులో మార్పు రావడానికి దోహదం చేసింది.
కరోనాపై కొవాగ్జిన్ ఏ విధంగా పనిచేస్తోంది?
కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరు నెలలు గడిచిన వారిని పరీక్షించి వారిలో టీసెల్ మెమరీ ఉందా? లేదా? అని పరిశీలించినప్పుడు అవి అందరిలో కనిపించాయి. తర్వాత వారికి వ్యాక్సిన్ ఇచ్చి చూసినప్పుడు బూస్టింగ్ ప్రభావం కనిపించింది. టీసెల్ స్పందన చాలా ముఖ్యం. కొవాగ్జిన్ వల్ల అది దీర్ఘకాలం ఉంటుంది. జికా వైరస్‌కు 2014లోనే వ్యాక్సిన్ కనుగొన్నాం. ఇప్పటికే మొదటి దశ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఇంకా రెండు ట్రయల్స్ జరగాల్సి ఉంది. త్వరలో సిద్ధం చేస్తాం.
ఇదీ చదవండి: