దేశీయ విపణిలోకి నాట్కో ఫార్మా ఇకపై ఏటా 8 నుంచి 10 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టనుంది. గురువారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ వీసీ నన్నపనేని ఈ విషయం వెల్లడించారు. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ విపణికి అధిక విలువ గల ఔషధాలు విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు 2019-20 సంస్థ ఆదాయాల్లో 8.65 శాతం నిధులను వెచ్చించినట్లు చెప్పారు. మూలధన వ్యయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.349 కోట్లు కాగా, ఇందులో విశాఖపట్నం యూనిట్ విస్తరణకు అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఎదుర్కొన్న సవాళ్లు ఇవీ..
కొవిడ్-19 వల్ల కేన్సర్ రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వెళ్లలేకపోయారని, ఫలితంగా కేన్సర్ ఔషధాల అమ్మకాలు తగ్గినట్లు తెలిపారు. ఈ ఔషధాల ధరలూ తగ్గాయని, హెపటైటిస్-సి ఔషధ అమ్మకాలు తగ్గాయని వివరించారు.
అమెరికా అమ్మకాలు తగ్గలేదు..
అమెరికాలో ధరల ఒత్తిడి, పోటీ ఉన్నప్పటికీ తమ ఔషధ అమ్మకాలు తగ్గలేదని వీసీ నన్నపనేని వివరించారు.
"అమెరికాలో మా ఔషధ అమ్మకాలు తగ్గలేదు. గ్లాటిరామర్ ఎసిటేట్, లిపోసోమల్ డాక్సోరుబిసిన్.. అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. పెద్దఎత్తున అమ్ముడయ్యే ‘లెనలిడోమైడ్’ ఔషధంతో కంపెనీ అనూహ్యమైన వృద్దిబాట పడుతుందని ఆశిస్తున్నాం. కెనడాలో వ్యాపారం ఆకర్షణీయంగా ఉంది. బ్రెజిల్‌లో వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో విస్తరణకు సన్నద్ధమవుతున్నాం. అమెరికాలో క్రమం తప్పకుండా కొత్త ఔషధాలు విడుదల చేసేందుకు వీలుగా ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్) దరఖాస్తులు దాఖలు చేస్తున్నాం."
---వీసీ నన్నపనేని, నాట్కో ఫార్మా ఛైర్మన్.
త్వరలో సస్యరక్షణ ఉత్పత్తుల తయారీ
నాట్కో ఫార్మా సస్య రక్షణ విభాగంలోకి విస్తరిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దీని కోసం నెల్లూరు జిల్లాలో కొత్త యూనిట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని ప్రారంభిస్తామని అన్నారు.
ఇదీ చూడండి:'సరళ్ జీవన్ బీమా' ప్రారంభమయ్యేది అప్పుడే!