రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే తొమ్మిదో అత్యంత ధనవంతుడిగా ఘనత సాధించారు. 'హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020' విడుదలు చేసిన జాబితాలో 67 బిలియన్ డాలర్లు (రూ.4.83 లక్షల కోట్లకు పైమాటే)తో ఆసియా అపరకుబేరుడిగా అవతరించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో స్థానం దక్కించికున్న ఏకైక ఆసియన్‌గా ముకేశ్ అంబానీ నిలిచారు.
అంబానీకి చెందిన టెలికాం వ్యాపారాలు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుండటమే ఇందుకు కారణమని హురూన్ రిచ్ లిస్ట్ పేర్కొంది.
మరిన్ని విశేషాలు..
ప్రపంచ కుబేరుల జాబితా టాప్ 10లో ముకేశ్ అంబానీ చోటు దక్కించుకోవడం ఇది రెండో సారి.
రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువను తాకిన తొలి భారతీయ కంపెనీగానూ రిలయన్స్‌కు పేరుంది.
ధనికుల దేశాల్లో భారత్ స్థానం..
అత్యధిక ధనవంతులు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ ఏకంగా 33 స్థానాలు మెరుగైంది. హరూన్ రిచ్ లిస్ట్ ప్రకారం 169 మంది భారతీయులు బిలియనీర్లుగా ఉన్నారు. వారిలో 137 మంది భారత్‌లో ఉండగా.. 32 మంది దేశానికి వెలుపల ఉంటున్నారు.
వాణిజ్య రాజధాని ముంబయి 50 మందితో దేశంలోనే అత్యధిక ధనికులున్న నగరంగా ఘనత సాధించింది. ఆ తర్వాత దిల్లీ (30 మంది) రెండో స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి:ఏజీఆర్ బకాయిలు: రూ.8 వేల కోట్లు చెల్లించిన ఎయిర్టెల్