కరోనా నేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ మానవ వనరుల విధానాలను సమీక్షించుకుంటున్నాయని అగ్రశ్రేణి కన్సల్టెన్సీ సేవల సంస్థ కేపీఎంజీ పేర్కొంది. 'కొవిడ్ హెచ్‌ఆర్ ప్రాక్టీసెస్ సర్వే రిపోర్ట్' అనే పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో 50 శాతం కంపెనీలు మాత్రం సిబ్బంది జీతభత్యాల్లో పెంపుకోసం రూపొందించిన బడ్జెట్ ప్రణాళికలను కొనసాగించే ఆలోచనతోనే ఉన్నాయి. అయితే 36 శాతం కంపెనీలు తమ సిబ్బంది జీతభత్యాల తగ్గింపు వైపు మొగ్గుచూపుతున్నాయని కేపీఎంజీ విశ్లేషించింది. సిబ్బంది జీతభత్యాలు, కొత్త నియామకాలు, ఉద్యోగుల మంచిచెడ్డలు చూడటం వంటి వివిధ అంశాలను పరిశీలించి, ఆయా అంశాలకు సంబంధించిన విశేషాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
నివేదిక ప్రకారం...
- దాదాపు 50 శాతం కంపెనీలు తమ సిబ్బంది ప్రమోషన్ల ప్రక్రియను వాయిదా వేయటం లేదా రద్దు చేసే ఆలోచనలో ఉన్నాయి. కానీ ఐటీ/ ఐటీఈఎస్, జీవశాస్త్రాలు, ఫార్మా, రిటైల్ రంగాల్లోని వ్యాపార సంస్థలు మాత్రం యధాతథ స్థితిని కొనసాగిస్తున్నాయి.
- ఆటోమొబైల్, విద్య, ఇంధనం, చమురు-సహజవాయువు రంగాల్లోని కంపెనీలు తమ సిబ్బందికి ఇక్రిమెంట్లు వాయిదా వేశాయి.
- దాదాపు 50 శాతం సంస్థలు తమ విక్రయాల విభాగంలో పనిచేసే సిబ్బందికి అందించే ప్రోత్సాహకాలను సమీక్షించే ఆలోచన చేస్తున్నాయి.
ల్యాప్‌టాప్ కూడా ఇస్తూ..
ఈ సర్వేలో పాల్గొన్న ఐటీ/ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టెన్సీ సేవల విభాగాలకు చెందిన 68 శాతం సంస్థలు తమ సిబ్బందికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. 48 శాతం సంస్థలు తమ సిబ్బందికి ఇంటి నుంచే పనిచేయటం కోసం ‘ల్యాప్‌టాప్’తో ఒక సెక్యూర్డ్ కనెక్షన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. పీఎస్‌యూలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిటైల్ విభాగాల్లోని కొన్ని కంపెనీలు తమ సిబ్బందిని సొంత ల్యాప్‌ట్యాప్‌లతో ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతిస్తున్నాయి.
నూతన నియామకాలు ఆగుతున్నాయ్
కొత్త నియామకాలను నిలుపుదల చేసినట్లు దాదాపు 66 శాతం సంస్థలు పేర్కొన్నాయి. 30 శాతం సంస్థలు తమ సిబ్బంది బడ్జెట్లను తగ్గిస్తున్నాయి. అంతేగాక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను ఇ-వెబినార్స్, ఈ-లెర్నింగ్ పద్ధతిలో నిర్వహించాలని ఎక్కువ కంపెనీలు భావిస్తున్నాయి.
దాదాపు 20 ప్రధాన వ్యాపార రంగాలకు చెందిన 315 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. దాదాపు అన్ని రకాల వ్యాపార రంగాలపై కొవిడ్-19 ప్రభావం చూపుతోందని, ఎంతో సంక్లిష్టమైన ఈ సవాలును ఎదుర్కొనటంలో భాగంగా కంపెనీలు తమ మానవ వనరుల విధానాలను మార్చుకుంటున్నాయని కేపీఎంజీ ఇండియా హెడ్ వైశాలి డోంగ్రీ వివరించారు.
ఇదీ చూడండి:నిమిషానికి 5 వేల ప్రకటనలపై గూగుల్ వేటు