సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 2019లో రికార్డు స్థాయిలో 'చెత్త' ప్రకటనలను తొలిగించినట్లు వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నవి, గూగుల్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రకటనలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఏడాదిలో 270 కోట్ల ప్రకటనలను తొలగించటం లేదా బ్లాక్ చేసినట్లు గూగుల్ స్పష్టం చేసింది. అంటే నిమిషానికి 5 వేల యాడ్లను తీసేసింది. అంతేకాకుండా.. 2.1 కోట్ల వెబ్ పేజీల నుంచి దాదాపు 12 లక్షల మంది ఖాతాలపై వేటు వేసింది.
కొవిడ్- 19 టాస్క్ఫోర్స్..
కరోనా సంక్షోభం వేళ డిమాండ్ పెరిగిన మాస్కులకు సంబంధించి నకిలీ ప్రకటనలనూ గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే నకిలీలపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు గూగుల్ ప్రకటన విభాగం ఉపాధ్యక్షుడు స్కాట్ స్పెన్సర్.
" మా మాధ్యమాల్లో సమగ్రతను కాపాడతాం. కరోనా సంక్షోభంలోనూ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. మా విధానాలు, నిబంధనలను ఉల్లంఘించేవారిని తొలగిస్తాం. వినియోగదారుల, ప్రకటనదారుల భద్రత కోసం వేలాది మంది గూగుల్ ఉద్యోగులం పనిచేస్తున్నాం."
- స్కాట్ స్పెన్సర్, గూగుల్ ప్రకటన విభాగం
ఇందుకోసం కొవిడ్- 19 టాస్క్ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు స్కాట్ తెలిపారు. కొన్ని నెలలుగా కరోనా సంబంధిత తప్పుడు ప్రచారాలను తొలగిస్తున్నామని వెల్లడించారు. నిరుద్యోగం, వైద్య పరికరాలు, మందుల కొరత ఇలా అనేక రకాల అంశాలపై దృష్టి పెట్టామన్నారు.