దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మరో ఘనత సాధించింది. 1986-87 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటి వరకు (35 ఏళ్లు) రెండు మిలియన్ల(20 లక్షలు) వాహనాలను ఎగుమతి చేసినట్లు ప్రకటించింది.
ఈ సంస్థ తొలిసారిగా 1987లో 500 కార్లను హంగేరీకి ఎగుమతి చేసింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా వాహనాల ఎగుమతిలో దూసుకెళుతోంది. 2012-13లో 10 లక్షల ఎగుమతుల మైలు రాయిని అందుకుంది.
" తొలి 10 లక్షల ఎగుమతుల్లో 50 శాతం ఐరోపా దేశాల్లో మార్కెట్ వృద్ధికి దోహదపడ్డాయి. ఆ తర్వాత రెండో మైలురాయిని 8ఏళ్లల్లో అందుకున్నాం. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో పెరుగుతున్న మార్కెట్‌ను అందిపుచ్చుకోవటం వల్ల అది సాధ్యపడింది. సంస్థ నిరంతర కృషితో చిలీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి దేశాల్లో మంచి మార్కెట్‌ను సంపాదించింది. ఆయా మార్కెట్లలో ఆల్టో, బలెనో, డిజైర్, స్విఫ్ట్ కార్లకు మంచి ఆదరణ ఉంది. "
- మారుతీ సుజుకీ
100కుపైగా దేశాలకు
ప్రస్తుతం తమ ఉత్పత్తులను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది మారుతీ సుజుకీ. అందులో 14 మోడల్స్, సుమారు 150 వేరియంట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి కంపాక్ట్ ఆఫ్ రోడ్ మోడల్ జిమ్నీ ఉత్పత్తి ప్రారంభించి.. ఎగుమతులు చేస్తోంది.
ఇదీ చూడండి: డీజిల్ సెగ్మెంట్లోకి మారుతీ రీ ఎంట్రీ!