మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సామాన్య జనంతో పాటు బాలీవుడ్ తారలు, క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయానికి దాదాపు 2014 ఎన్నికల(63.38 శాతం) మాదిరిగానే ఈసారీ 63శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్‌కు దూరంగా దిగ్గజ వ్యాపార వేత్తలు
అయితే దిగ్గజ వ్యాపార వేత్తలైన రతన్ టాటా, ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, సజ్జన్ జిందాల్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లాంటి వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బిజీ షెడ్యూల్ వల్లే వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని వారి అధికార ప్రతినిధులు తెలిపారు. చంద్రశేఖరన్‌తో పాటు జిందాల్ సోమవారం ముంబయిలో లేరని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్వీట్ చేశారు జిందాల్.
సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ కుటుంబంతో పాటు వచ్చి ఓటు వేసే అంబానీ సోదరులు.. ఈ సారి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్‌లో ముకేశ్, అనిల్ అంబానీల గైర్హాజరుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఓటేసిన ప్రముఖ వ్యాపార వేత్తలు వీరే..
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ కెకీ మిస్త్రీ, మారికో ఛైర్మన్ హర్ష్ మారివాలా, ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గొయెంకా తదితరులు అసెంబ్లీ ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
గురువారం ఫలితాలు
మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. భాజపాకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని తెలిపాయి. గురువారం తుది ఫలితాలు వెలువడనున్నాయి.