చిన్న కష్టం వస్తేనే.. అల్లాడిపోతూ ఉంటాం. ఎవరైనా సాయం చేస్తారేమోనని వేచి చూస్తాం. అలాంటిది ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తిపై కష్టాలు మూకుమ్మడి దాడి చేశాయి. ఒకదాని తర్వాత ఒకటి పిడుగులా మీదపడ్డాయి. పోరాడి... పోరాడి అలసిపోయిన ఆ గుండె శాశ్వతంగా ఆగిపోయింది.
కార్పొరేట్ ఆర్థిక సంక్షోభాలు, కుంభకోణాల కారణంగా ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇటీవల ఉద్యోగం పోగొట్టుకున్న జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగి.. తాజాగా పీఎంసీ కుంభకోణంలో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును కోల్పోయాడు.
పీఎంసీ బ్యాంకుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో రోజూ పాల్గొంటున్నాడు ఖాతాదారు సంజయ్ గులాటి. తమ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ సోమవారం కొన్ని గంటలపాటు నిరసనల్లో పాల్గొన్నాడు. కాస్త ఆలస్యంగా ఇంటికెళ్లిన సంజయ్.. గుండెపోటుతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు వదిలాడు.
డబ్బు వస్తుందో లేదోనని..
ముంబయిలోని ఓషివరా ప్రాంతానికి చెందిన సంజయ్ గులాటి.. జెట్ ఎయిర్వేస్లో పనిచేసేవాడు. అతనికి దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడు. అతని చదువుకు, వైద్య ఖర్చులకు భారీగా డబ్బులు అవుతాయి.
ఈ పరిస్థితుల్లో ఉద్యోగంతో పాటు దాచుకున్న డబ్బు పోవటం వల్ల ఆందోళనకు గురై మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఉద్యోగం పోవటం వల్ల కొన్ని రోజులుగా తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. బ్యాంకు సంక్షోభంతో ఆయనపై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. బ్యాంకు నుంచి డబ్బులు వస్తాయో లేదోనని భయపడుతూ ఉండేవారు. కొడుకు స్కూలు ఫీజులు, వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే గుండె భారంతో సోమవారం ప్రాణాలు వదిలారు."
-బిందు గులాటి, సంజయ్ భార్య
పీఎంసీ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం కారణంగా ఆర్థికంగా దివాలా తీసింది సంస్థ. ఈ నేపథ్యంలో నగదు ఉపసంహరణ పరిమితిని మొదట రూ.వెయ్యికి కుదించింది ఆర్బీఐ. దురదృష్టవశాత్తు సంజయ్ మరణించిన రోజే నగదు ఉపసంహరణను రూ.40 వేలకు పెంచింది.
ఇదీ చూడండి: రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు