దేశీయ ఐటీ-బీపీఓ రంగ ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం వృద్ధి చెందుతాయని నాస్‌కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) అంచనావేసింది. ఇందులోనూ డిజిటల్ విభాగ ఆదాయాల్లో 23 శాతం వృద్ధి లభించే అవకాశం ఉందని తెలిపింది. ఖాతాదార్ల అవసరాలను గమనించి, డిజిటల్ సేవల విస్తృతిపై దృష్టిపెట్టిన కంపెనీలు ఇప్పటికే 28 శాతం ఆదాయాన్ని ఈ విభాగం నుంచే ఆర్జిస్తున్నాయి. ఇందుకోసమే ప్రస్తుత ఉద్యోగులకూ ఆయా నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పిస్తూ, నూతన నియామకాల్లోనూ వీటికే ప్రాధాన్యమిస్తున్నాయి.
ఏటా 6 లక్షల మందికి పునఃశిక్షణ
దేశీయంగా ఐటీ రంగంలో దాదాపు 44 లక్షల మంది పనిచేస్తున్నారు. అవసరానికి తగిన కోర్సులు నేర్వని ఉద్యోగులకు, ప్రతిభ చూపని వారికి ఉద్వాసన పలుకుతున్న ఐటీ కంపెనీలు, గతేడాది దాదాపు 6 లక్షల మందికి డిజిటల్ సాంకేతికతలపై కంపెనీలు శిక్షణ ఇప్పించాయి. ఈ ఏడాది దాదాపు అదేస్థాయిలో ఈ శిక్షణ ఉండొచ్చని శిక్షణ సంస్థల అంచనా.
- దేశంలో ఐటీ నిపుణులు - 43.6 లక్షలు
- 2019-20 నియామకాలు - 2.05 లక్షలు
- డిజిటల్ నైపుణ్యాలు నేర్చినవారు - 8.84 లక్షలు
- దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయం - 14 లక్షల కోట్లు
ఉద్యోగంలో కొనసాగాలంటే, డిజిటల్ టెక్నాలజీలపై పట్టు సాధించడం తప్పనిసరి. ఉద్యోగులు కూడా ముందుకొస్తున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్.. ఏదైనా వినియోగించుకుని తమకు అనువైన సమయాల్లోనే కొత్త కోర్సులు అభ్యసించే వీలును ఉద్యోగులకు ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. తగిన నైపుణ్యాలు గల వారిని ఎంపిక చేయడంతో పాటు, శిక్షణ ఇచ్చే బాధ్యతలను వేరే సంస్థలకు అప్పగిస్తున్నాయి.
ఐటీ రంగంలో అనుభవజ్ఞులు, దిగ్గజ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేసిన వారితో ప్రణాళికలు రూపొందించి, ఆ మేరకు శిక్షణ ఇప్పించడంలో మరికొన్ని కంపెనీలు నిమగ్నమవుతున్నాయి. దిగ్గజ సంస్థలకు ఇందువల్ల సమయం, వ్యయాలు ఆదా అవుతున్నాయని ఇలాంటి సేవలను భారత్, అమెరికాలో అందిస్తున్న టెక్‌ఎరా ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన అవకాశాలు
ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు 2 విడతలలో కంపెనీలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబరు - డిసెంబరు తొలివిడతగా, మళ్లీ ఫిబ్రవరి - ఏప్రిల్‌లో రెండో విడతగా చేస్తున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, విశ్వవిద్యాలయాలలతో పాటు ప్రసిద్ధి చెందిన ఇంజినీరింగ్ కళాశాలల్లో భర్తీ అధికంగా జరుగుతోంది. వచ్చిన ప్రాజెక్టులు, ఉద్యోగుల వలసలకు అనుగుణంగా మరిన్ని నియామకాల కోసం ఇంకొన్ని కళాశాలలకూ ఐటీ కంపెనీలు వెళ్తున్నాయి.
మిగిలిపోయిన కళాశాలల్లోని విద్యార్థులకూ అవకాశం కల్పించేందుకు ఆఫ్‌క్యాంపస్ ఎంపికలను ఐటీకంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఇవి తమ కార్యాలయ ప్రాంగణంలోనో, లేదా ఆయా ప్రాంతాల్లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలు బాగున్న కళాశాలలోనో జరుపుతున్నారు. వీటిల్లో ఏ కళాశాల విద్యార్థి అయినా తమ ప్రతిభ నిరూపించుకుని, ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
గతేడాది పూర్తయిన వారికీ..
గతేడాది ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఉద్యోగావకాశం పొందలేకపోయిన వారు కనుక, ఈ ఏడాది ప్రయత్నిద్దామనుకుంటే ఏ కంపెనీ కూడా ప్రాంగణ, ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరు కానివ్వడంలేదు. ఇటువంటి వారి కోసం హైసియా (హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు, స్క్రీనింగ్ పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షను కెమెరా అనుసంధానించిన డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ ద్వారా మాత్రమే రాయాల్సి ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అభ్యర్థిని సదరు కెమెరా చిత్రీకరిస్తూ ఉంటుంది. అభ్యర్థి బదులుగా వేరొకరు పరీక్ష రాసే అక్రమ పద్ధతులను దూరం చేసేందుకే ఇది చేపట్టారు. వేలమంది దరఖాస్తు చేసుకున్నా, అర్హత మార్కులు సాధించిన వారినే ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు.
ఒకరకంగా వీరంతా ప్రీసెలెక్టెడ్ అభ్యర్థులన్నమాట. దిగ్గజ కంపెనీలు, అంకుర సంస్థలు సహా మొత్తం 52 సంస్థలు గత నెల హైదరాబాద్ జేఎన్‌టీయూలో జాబ్‌ఫెయిర్ నిర్వహించి, 715 మందికి అవకాశాలు కల్పించాయి. ఇలా చేయడంవల్ల కంపెనీలకూ సమయం, వ్యయాలు ఆదా అవుతాయని నిర్వహణ బాధ్యతలు వహించిన కిరణ్ తెలిపారు.