సామాజిక మాధ్యమాల సందేశాల ఎన్క్రిప్షన్ విధానాన్ని భారత్ స్వాగతిస్తుందన్నారు కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. కానీ తప్పుడు సందేశాల వ్యాప్తి నియంత్రణకోసం వాటి మూలాలను గుర్తించేందుకు భద్రతా సంస్థలకు అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. దిల్లీలో నేడు ప్రారంభమైన 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.
"ఎన్క్రిప్షన్కు అభ్యంతరం లేదు. ప్రజలను ఆందోళనకు గురి చేసే వదంతుల సందేశం ఒకే ప్రాంతం, ఒకే అంశం, పదే పదే వ్యాప్తి చెందుతోంది. వాటి మూలాన్ని గుర్తించి తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టే వీలు భద్రతా సంస్థలకు ఉండాలి. "
-రవిశంకర్ ప్రసాద్, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి
ప్రపంచంలో అత్యధిక డేటాను భారత్ వినియోగిస్తోందని గుర్తు చేశారు రవిశంకర్. డేటా ఎనలిటిక్స్, డేటా క్లీనింగ్, డేటా రిఫైనింగ్‌కు భారత్ కేంద్రం కావాలని ఆకాంక్షించారు. అంతర్జాలం స్థిరంగా, రక్షణగా, భద్రంగా ఉండాలన్నారు రవిశంకర్.
కుదరని ఏకాభిప్రాయం
సందేశాల మూలాన్ని గుర్తించే అంశంపై ప్రభుత్వానికి, వాట్సాప్ సంస్థకు మధ్య ఏకాభిప్రాయం కదరటం లేదు.
సందేశం మూలం తెలిస్తే వినియోగదారుల సమాచార గోప్యత విధానాన్ని ఉల్లంఘించినట్లేనని వాట్సాప్ వాదిస్తోంది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని గత నెలలో రవిశంకర్‌తో భేటీలో ఫేస్బుక్ గ్లోబల్ ఎక్జిక్యూటివ్ నిక్ క్లెగ్ సూచించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇతరులకు పంపే సందేశాలను ఎవరూ తెలుసుకునే వీలు లేకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది వాట్సాప్.
ఇదీ చూడండి: 6 పైసల కోసం టెలికాం దిగ్గజాల మధ్య మీమ్స్ వార్