టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది. దేశంలో రూ.5 వేల కన్నా తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను విడుదల చేయాలని జియో యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత క్రమంగా ఈ ఫోన్ ధరను రూ.2,500 నుంచి రూ.3 వేలకు తగ్గించాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి.
ప్రస్తుతం 2జీ నెట్వర్క్ వినియోగిస్తున్న 20 నుంచి 30 కోట్ల మందే ప్రధాన లక్ష్యంగా.. జియో ఈ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న 5జీ ఫోన్ కనీస ధర రూ.27 వేలుగా ఉండటం గమనార్హం.
ఈ విషయంపై జియో మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇంతకు ముందు కూడా జియో.. 4జీ ఫోన్‌ను రూ.1,500 రిఫండబుల్ డిపాజిట్‌తో విక్రయించిన విషయం తెలిసిందే.
2జీ ముక్త భారత్ కోసమేనా?
ప్రస్తుతం భారత్ 5జీ కోసం ప్రయత్నిస్తున్నా.. దేశవ్యాప్తంగా ఇంకా దాదాపు 35 కోట్ల మంది 2జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎంలో సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. వారందరికీ తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు ఇవ్వడం ద్వారా దేశాన్ని 2జీ రహితంగా మార్చాల్సిన అవసరముందని అన్నారు.
ముకేశ్ చేసిన అప్పట్లో చేసిన ఈ ప్రకటన.. తాజాగా వస్తున్న వార్తలకు మరింత బలాన్నిస్తోంది.
ఇదీ చూడండి:యాక్టివ్ యూజర్లలో మళ్లీ జియోనే టాప్