మార్కెట్లోకి ప్రవేశిస్తూనే ప్రత్యర్థి సంస్థలకు దడ పుట్టించిన రిలయన్స్ జియో మరో ఘనత సాధించింది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకే 33.1 కోట్ల మంది యూజర్లతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది.
ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న వొడఫోన్ ఐడియా యూజర్లు జూన్ నాటికి 32 కోట్లకు తగ్గారు. మార్చిలో ఈ సంస్థకు 33.4 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2019-20 తొలి త్రైమాసిక ఫలితాల్లో భాగంగా ఈ గణాంకాలు వెల్లడించింది వొడాఫోన్ ఐడియా.
గత వారమే 2019-20 క్యూ1 ఫలితాలు ప్రకటించిన రిలయన్స్.. జియో యూజర్లు 33.1 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది.
ఇటీవలే రెండో స్థానం.. అంతలోనే టాప్
టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' దేశంలోని టెలికాం సంస్థల వినియోగదారుల గణాంకాలను ఇటీవలే ప్రకటించింది. మే చివరి నాటికి 32.2 కోట్ల యూజర్లతో ఎయిర్‌టెల్‌ను వెనక్కు నెట్టి 'జియో' రెండో స్థానానికి ఎగబాకినట్లు పేర్కొంది. మే చివరి నాటికి ఎయిర్‌టెల్‌కు 32.03 కోట్ల వినియోగదారులు ఉన్నారు.
మేలో రెండో స్థానానికి ఎగబాకిన రిలయన్స్ జియో.. కేవలం ఒక్క నెలలోనే (జూన్ చివరినాటికి) అగ్ర స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌పై బంపర్ ఆఫర్ భారత్‌కే!