ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ మనుగడ ఇంకా క్లిష్టంగానే ఉంది. అత్యవసర నిధుల విడుదలపై నేడు సమావేశమైన బ్యాంకుల కన్సార్టియం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం సంస్థను ఒత్తిడిలో పడేసింది. 20 వేల మంది ఉద్యోగాలను రక్షించాలని పైలట్ల సంఘం, నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్.. ప్రధానమంత్రిని, బ్యాంకులను కోరినప్పటికీ పురోగతి లేదు.
జెట్ ఎయిర్ వేస్‌కు అత్యవసర నిధుల విడుదలపై పెట్టుబడిదారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వినయ్ దుబే తెలిపారు. ఎయిర్‌లైన్స్ బోర్డు రేపు మరోమారు సమావేశమవుతుందని పేర్కొన్నారు.
"మా కార్యకలాపాలు కొనసాగించడానికి మధ్యంతర నిధుల విడుదలకు పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును ఈ నెల 18 వరకు వాయిదా వేస్తున్నాం. పెట్టుబడిదారులు, ఇతర సంబంధిత విషయాలపై ప్రస్తుత స్థితిని రేపు బోర్డు ముందుంచుతాం."
- వినయ్ దూబే, జెట్ ఎయిర్వేస్ సీఈఓ
ప్రస్తుతం ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియమ్.. జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రూ. 1,500 కోట్లు ఇవ్వనున్నట్లు గత నెల మార్చి 25న బ్యాంకు అంగీకరించింది. కానీ బ్యాంకులు రూ.300 కోట్లు మాత్రమే పంపణీ చేశాయి. ఫలితంగా... ఎయిర్ లైన్స్ వందల విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.
" జెట్ ఎయిర్వేస్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకుల కన్సార్టియం చర్యలు చేపడుతోంది. వాటాదారుల మధ్య మద్దతు, సహకారం ఇందులో కీలకం''
- ఎస్బీఐ
పైలట్ల నిరాశ
సోమవారం జరిగిన సమావేశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు పైలట్లు. ఈ భేటీలో ఎంతోకొంత నగదు అందుతుందని ఆశపడినట్లు పేర్కొన్నారు. కానీ పెట్టుబడిదారులు ప్రస్తుతం ఎలాంటి నిధులు ఇవ్వటం లేదని చెప్పటం నిరాశకు గురిచేసిందన్నారు. రేపటి సమావేశంలో నిధులపై ఒకవేళ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకుంటే సంస్థ ఎన్నోరోజులు కొనసాగదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.