భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో స్మార్ట్ఫోన్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
జులై-సెప్టెంబర్ మధ్య మూడు నెలల కాలంలో 49 మిలియన్ల స్మార్ట్ఫోన్లు విక్రయమైనట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఇది 10 శాతం ఎక్కువ.
"ఆన్లైన్లో కొనుగోళ్లపై అవగాహణ పెరగటం, ఆకర్షణీయమైన ప్రమోషన్లు, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, ఎక్స్ఛేంజి ఆఫర్ల వంటివి విక్రయాలను పెంచాయి. ముఖ్యంగా పండుగ సీజన్ అమ్మకాలు, ఆఫ్‌లైన్‌లో విక్రయాల వృద్ధి ఇందుకు కారణమయ్యాయి."
- అన్షిక జైన్, కౌంటర్‌పాయింట్ పరిశోధన విశ్లేషకురాలు
ఏ సంస్థ వాటా ఎంత?
ఈ ఏడాది మూడో త్రైమాసికంలోనూ.. షియోమీ 26 శాతం మార్కెట్ వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. శామ్సంగ్ 20 శాతం, వివో 17 శాతం, రియల్ మీ 16 శాతం, ఒప్పో 8 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
లగ్జరీ స్మార్ట్‌ఫోన్ యాపిల్ భారత్‌లో ఉత్తమ 10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో చోటు దక్కించుకుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ ధర తగ్గించడం.. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 11కు దక్కుతున్న ఆదరణతో యాపిల్ ఈ వృద్ధి సాధించగలిగింది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో వన్‌ప్లస్ ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది క్యూ3లో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయినట్లు కౌంటర్‌పాయింట్ పేర్కొంది. వన్‌ప్లస్ 7టీ విడుదల, వన్‌ప్లస్ 7 సీరీస్‌పై ఇస్తోన్న భారీ డిస్కౌంట్లు ఇందుకు కారణమని తెలిపింది.
ఫీచర్ఫోన్లు డీలా..
స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరిగినా.. ఫీచర్ ఫోన్ల విక్రయాలు భారీగా తగ్గాయి. కౌంటర్ పాయింట్ ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే 37 శాతం క్షీణించినట్లు వెల్లడైంది. జియో ఫీచర్ ఫోన్ శ్రేణిలో కొత్త మోడల్ మార్కెట్లోకి రాకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఫీచర్‌ఫోన్ సెగ్మెంట్లో శామ్సంగ్ 22 శాతం మార్కెట్ వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. ఐటెల్ 16 శాతం, లావా 16 శాతం, నోకియా 12 శాతం మార్కెట్ వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: దంతేరస్: పసిడి కొంటున్నారా.. ఈ ఐదూ సరిచూసుకోండి