నిరర్థక ఆస్తులు అధికం కావడం సహా.. నియంత్రణ పరంగా లోపాలుండటం కారణంగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)పై ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించింది. ఇందులో ముఖ్యంగా ఆరు నెలల పాటు పొదుపు, కరెంటు ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న మొత్తంలో నుంచి రూ.1,000కి మించి తీసుకోకుండా నియంత్రణ విధించింది. అనంతరం రూ.10,000కు పెంచినప్పటికీ.. ఈ నిబంధన ఒక్కసారిగా ఆ బ్యాంకులో ఖాతాలున్న ఎంతోమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ బ్యాంకులో తమ అవసరాలకు డబ్బు దాచుకున్న వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ బ్యాంకు విషయం ఎలా ఉన్నా.. నిరర్థక ఆస్తులు పెరిగి, ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ఖాతాదారులకు ఉన్న రక్షణ ఏమిటన్నది చాలామందిలో సందేహాన్ని రేకెత్తిస్తోంది.
ఒక బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు డిపాజిట్ బీమా సౌకర్యం ఉంటుంది. మన దేశంలో చాలా బ్యాంకులు ఈ డిపాజిట్ బీమాను అమలు చేస్తున్నాయి. ఇందుకోసం ఉన్నదే ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ). ఖాతాదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే.. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో ఈ సంస్థ డిపాజిటర్లకు, నిర్దేశించిన గరిష్ఠ మొత్తం వరకూ డిపాజిట్ బీమా భద్రతను కల్పిస్తుంది.
డిపాజిట్ బీమా వర్తించే అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా?
డీఐసీజీసీ ద్వారా అన్ని ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, స్థానిక ప్రాంత బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, మన దేశంలో పనిచేస్తున్న విదేశీ బ్యాంకు శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర, ప్రాథమిక సహకార బ్యాంకులు, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోని డిపాజిటర్లకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన డిపాజిట్లకు ఈ బీమా వర్తించదు. దేశవ్యాప్తంగా ఒకటి రెండు పెద్ద బ్యాంకులు తప్ప దాదాపు అన్నీ ఈ బీమా పథకాన్ని అందిస్తున్నాయి. పొదుపు, కరెంటు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు, అన్ని రకాల కాల పరిమితి డిపాజిట్లకు ఈ బీమా వర్తిస్తుంది. విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, ఇంటర్ బ్యాంకు డిపాజిట్లు, రాష్ట్ర సహకార బ్యాంకు స్టేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంకుల డిపాజిట్లు, ఆర్‌బీఐ ముందస్తు ఆమోదంతో కార్పొరేషన్‌తో ప్రత్యేకంగా మినహాయింపు పొందిన మొత్తాలన్నింటికీ ఇది వర్తిస్తుంది.
ఎంత మొత్తం వరకూ
ఒక్కో డిపాజిటర్‌కూ, యాజమాన్య హక్కు, హోదాను అనుసరించి, ఒక్కో బ్యాంకులో గరిష్ఠంగా అసలు, వడ్డీ కలిపి రూ.1,00,000 వరకూ డీఐసీజీసీ ద్వారా బీమా వర్తిస్తుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను విడివిడిగానే పరిగణిస్తారు. ఒకే రోజు రెండు బ్యాంకులు వైఫల్యం చెందిన సందర్భంలో ఆ రెండు బ్యాంకుల్లో డిపాజిటర్‌కు గరిష్ఠంగా రూ.లక్ష చొప్పున బీమా వర్తిస్తుంది. అదే.. ఒకే బ్యాంకుకు చెందిన వివిధ శాఖల్లో ఒకే ఖాతాదారుడికి వివిధ డిపాజిట్లు ఉన్నప్పుడు అతనికి గరిష్ఠంగా రూ.1,00,000 వరకే బీమా వర్తిస్తుంది. అంటే.. రాజు అనే వ్యక్తికి ఏబీసీ బ్యాంకులో పొదుపు, కరెంటు, రికరింగ్ డిపాజిట్ ఖాతాల్లో డబ్బులున్నాయనుకుందాం. అప్పుడు అన్ని ఖాతాలకూ ఒకే యజమానిగా ఉండటం వల్ల అతనికి రూ.1,00,000వరకే బీమా లభిస్తుంది. అదే వేర్వేరు హోదాల్లో.. అంటే.. వ్యక్తిగతంగా, ఏదైనా సంస్థకు భాగస్వామిగా ఉన్నప్పుడు నిబంధనల మేరకు బీమా వర్తిస్తుంది. అదే రాజు.. ఏబీసీ, ఎక్స్‌వైజెడ్ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తున్నాడు.. ఆ రెండు బ్యాంకులూ దివాలా తీస్తే.. ఒక్కో బ్యాంకు నుంచి రూ.లక్ష వరకూ బీమాను వర్తింపజేస్తారు.
ఉమ్మడి ఖాతాలుంటే..
వేర్వేరు వ్యక్తులు ఉమ్మడిగా, ఒకే బ్యాంకులో వేర్వేరు శాఖల్లో ఒకటికంటే ఎక్కువ (పొదుపు, కరెంటు, ఫిక్స్‌డ్, రికరింగ్) ఖాతాలు నిర్వహిస్తోన్న పక్షంలో ఖాతాల్లో పేర్లు ఒకే క్రమంలో ఉన్నప్పుడు ఆ ఖాతాలన్నీ ఒకే యాజమాన్య హక్కు, హోదాలో ఉన్నట్లుగా భావించి, గరిష్ఠంగా రూ.లక్ష బీమా వర్తింపజేస్తారు. వ్యక్తుల పేర్లు వివిధ క్రమాల్లో ఉంటే.. ఆయా ఖాతాలను విడివిడిగా పరిగణించి, వేర్వేరుగా రూ.లక్ష బీమా వర్తింపజేస్తారు. డిపాజిటర్లకు బీమా సొమ్ము చెల్లింపు చేసే సమయంలో అతను/ఆమె బ్యాంకుకు ఏదైనా బాకీ ఉంటే దాన్ని సర్దుబాటు చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది.
మనమేం చేయాలి?
సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే.. కో-ఆపరేటివ్ బ్యాంకులు కొద్దిగా అధిక వడ్డీని ఇస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే చాలామంది ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పూర్తిగా ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటాయి. వీటి విషయంలో ఆర్‌బీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బీఐలు ఉమ్మడిగా నియంత్రిస్తుంటాయి. మీరు ఎంచుకున్న కో-ఆపరేటివ్ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న సంగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లాభనష్టాలు ఎలా ఉన్నాయి, ఎన్‌పీఏల సంగతేమిటి? అనేది తెలుసుకుంటూ ఉండాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు చివరికి రూ.5.54 లక్షల కోట్లకు ద్రవ్యలోటు