ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్ దంపతులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈనెల 30న దీపక్ కొచ్చర్, ఆయన తమ్ముడు రాజీవ్, మే 3న చందాకొచ్చర్ దిల్లీలో దర్యాప్తు అధికాల ముందు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నివారణ చట్టం కింద వారి వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత, అధికారిక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను వెంట తీసుకురావాలని గతవారం జారీచేసిన సమన్లలో సూచించింది ఈడీ.
మనీలాండరింగ్ కేసులో భాగంగా మార్చి 1న ముంబయిలోని పలువురి ఇళ్లల్లో తనిఖీలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. అనంతరం వారిని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ సంస్థకు రూ.1875 కోట్ల రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చూడండీ: రాహుల్ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు