భారత్లో కరోనాపై పోరాటానికి మద్దతుగా రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది ప్రైవేట్ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ గ్రూప్. ఇందులో భాగంగా రూ.80 కోట్లు పీఎం కేర్స్ నిధికి అందించనున్నట్లు తెలిపింది. మరో రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులకు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది.
"కష్ట సమయాల్లో ఐసీఐసీఐ గ్రూపు సంస్థలు దేశానికి తమ వంతుగా సాయపడ్డాయి. కరోనా మహమ్మారి అనుకోని సవాళ్లను దేశం ముందు ఉంచింది. మనమంతా కలిసి ఈ మహమ్మారిపై పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. కరోనాపై యుద్ధంలో ముందుండి పనిచేస్తున్న వారికి భరోసా కల్పించాలి."
-సందీప్ బాత్రా, ఐసీఐసీఐ బ్యాంక్ అధ్యక్షుడు
పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాలు, ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందించినట్లు ఐసీఐసీఐ గ్రూపు తెలిపింది. 2.13 లక్షల సర్జికల్ మాస్కులు, 40 వేల ఎన్-95 మాస్కులు, 20 వేల లీటర్ల శానిటైజర్లు, 16 వేల గ్లోవ్స్, 5,300 పీపీఈలు, 2,600 వేల కంటి సంరక్షణ పరికరాలు, 50 థర్మల్ స్కానర్లు, 3 వెంటిలేటర్లు ఇచ్చినట్లు వెల్లడించింది.
డిజిటల్ రూపంలో విరాళాల సేకరణకు కేంద్ర, రాష్ట్ర, నగర పాలక సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.
ఇదీ చూడండి: కరోనాపై పోరుకు శాంసంగ్ ఇండియా రూ.20 కోట్ల విరాళం