చందా కొచ్చర్‌ను మేనేజింగ్ డైరక్టర్, కార్యనిర్వాహక అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది ఐసీఐసీఐ బ్యాంక్. ఆమెకు అందించిన వివిధ రకాల సొమ్ములనూ వసూలు చేయడానికి ఆదేశాలివ్వాలని కోరింది.
తనను పదవి నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్ దాఖలు చేసిన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా ఐసీఐసీఐ ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. కొచ్చర్ వ్యాజ్యాన్ని కొట్టివేయాలనే అంశాన్ని వాణిజ్య దావా(కమర్షియల్ సూట్)తో నిర్ణయించవచ్చని పేర్కొంది.
"2016 ఏప్రిల్-2018 మార్చి కాలంలో అందించిన బోనస్‌లు, స్టాక్లను క్లాబ్యాక్ రూపంలో వెనక్కి ఇచ్చేలా కొచ్చర్‌కు ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశాం."
- ఐసీఐసీఐ బ్యాంకు
క్లాబ్యాక్ అంటే..
దుష్ప్రవర్తన, లాభాల తగ్గుదలతో ఓ ఉద్యోగికి ఇచ్చిన బోనస్, ఇతర చెల్లింపులను వెనక్కి తీసుకునే వెసులుబాటే క్లాబ్యాక్.
ఈనెల 20న విచారణ..
జస్టిస్ ఆర్ వీ మోరే, జస్టిస్ ఎస్పీ తవాడే బెంచ్.. ఐసీఐసీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించాలని చందా కొచ్చర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. దీనిపై ఈ నెల 20న విచారించనుంది బొంబాయి హైకోర్టు.
వివాదం ఇలా..
వీడియోకాన్ గ్రూప్‌నకు.. ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగింది. ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొన్న కొచ్చర్‌ను.. బ్యాంక్ బోర్డు తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించింది. కానీ, ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడం మొదలు పెట్టింది. జూన్ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణను ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి నియమించింది.
ఈ పరిణామాల తర్వాత ఆమెను తొలగిస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇతర మొత్తాలను నిలిపివేసింది. ఏప్రిల్ 2009 నుంచి 2018 మార్చి వరకు చెల్లించిన బోనస్‌లనూ వాపస్ చేయాలని కోరింది.