అమెరికాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ దేశంలో ఉన్న రెండు కార్ల ఉత్పత్తి ప్లాంట్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై భారత్‌లో దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఫోర్డ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
రెండు ప్లాంట్లు ఇవే..
దాదాపు 2.5 బిలియన్ డాలర్లు వెచ్చించి.. చెన్నై(తమిళనాడు), సానంద్ (గుజరాత్)లో రెండు ప్లాంట్లను నెలకొల్పింది ఫోర్డ్. ఈ రెండింటి నుంచి ఎకో స్పోర్ట్, ఫీగో, యాస్పైర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఈ ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనుంది.
ప్లాంట్ల మూసివేతకు కారణాలు ఇవేనా?
భారత్‌లో చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నా ఫోర్డ్ ఆశించిన ఫలితాలు రాలేదు. ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగిపోయింది.
మహీంద్రాతో ఒప్పందం రద్దు..
2019లో మహీంద్రా & మహీంద్రా, ఫోర్డ్ కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌లో ఫోర్డ్ బ్రాండ్‌కు మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాలు చూడటం ఈ జాయింట్ వెంచర్ ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలోనూ ఫోర్డ్, మహీంద్రా వాహనాలను విక్రయ కార్యకలాపాలు కలిసి నిర్వహించేలా ఇరు సంస్థలు అవగహనకు వచ్చాయి. అయితే ఆ ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరిలో రద్దు చేసుకున్నాయి. ఇరు సంస్థలు వేర్వేరుగానే కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించుకున్నాయి.
ఈ కారణాలన్నింటితో పాటు.. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగానే భారత్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపేయాలని ఫోర్డ్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే.. భారత్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపేసిన రెండో అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ కానుంది ఫోర్డ్.
జీఎం కూడా ఇలానే..
ఇది వరకే 2017లో ఆ దేశానికి చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) కూడా భారత్‌లో వాహన విక్రయాలను నిలిపివేసింది. దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదని అప్పట్లో జీఎం ప్రకటించింది.
అమ్మకాలు నిలిపివేసిన కారణంగా.. గుజరాత్లో కంపెనీ ప్లాంట్‌ను ఎంజీ మోటార్స్‌కు విక్రయించింది. అయినప్పటికీ.. ఎగుమతుల కోసం మహారాష్ట్రలోని ప్లాంట్‌లో ఉత్పత్తి కొనసాగించింది. చివరకు 2020లో అక్కడ కూడా ఉత్పత్తిని ఆపేసింది జీఎం.
ఇదీ చదవండి: ఫోర్డ్-మహీంద్రా జాయింట్ వెంచర్ ఒప్పందం రద్దు