వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్ను విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఛార్టెడ్ అకౌంటెంట్లు, వ్యాపారులు, ఇతర వాటాదార్లతో సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో జీఎస్టీ ఫారాలు, ఫైలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం.. రిటర్నుల దాఖలులో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న జీఎస్టీ చెల్లింపుదార్లు.. ప్రస్తుత ఫైలింగ్ విధానంలో ఎదుర్కొంటున్న సమస్యలను సీతారామన్ దృష్టికి తీసుకువచ్చారు.
అందరి అభిప్రాయాలను తీసుకుని త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నిర్మలా సీతారామన్ వారికి హామీ ఇచ్చినట్లు.. రెవెన్యు కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. దేశవ్యాప్తంగా త్వరలో సమావేశాలు నిర్వహించాలని సీతారామన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
జీఎస్టీ రిటర్నుల విధానం ప్రస్తుతం ...ట్రయల్ బేసిస్పై అందుబాటులో ఉన్నట్టు పాండే తెలిపారు. కొత్త వ్యవస్థపై డిసెంబర్ 7 నుంచి జీఎస్టీ చెల్లింపుదార్ల నుంచి అభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 85 వేల రిటర్నులను స్వతంత్ర ప్రాతిపదికన కొత్త వ్యవస్థ ద్వారా ఫైలింగ్ చేయుటకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు పాండే. 2020 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారాల వినియోగం తప్పని సరి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆర్కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా