ఫేస్బుక్... ప్రస్తుతం ప్రతీ రోజు 200 కోట్ల మందిని శాసిస్తున్న సామాజిక మాధ్యమం. ఇప్పుడు సొంత కరెన్సీనీ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బిట్‌కాయిన్ మాదిరి క్రిప్టో కరెన్సీని తీసుకు రానున్నట్లు అధికారికంగా వెల్లడించింది ఫేస్బుక్. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఫ్లాట్‌ఫారంపై ఈ-కామర్స్ సేవలను విస్తరించడం, వాణిజ్య ప్రకటనలు పెంచుకునే దిశగా ఆ సంస్థ క్రిప్టోకరెన్సీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
పేపాల్, ఊబెర్, స్పాటిఫై, వీసా, మాస్టర్ కార్డుల భాగస్వామ్యంతో ఈ క్రిప్టోకరెన్సీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది ఫేస్బుక్. దానికి 'లిబ్రా' అని నామకరణం కూడా చేసింది. ప్రత్యేకించి 'లిబ్రా'ను నిర్వహించేందుకు కలిబ్రా అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
అయితే ఇప్పటికే డాటా ప్రైవసీ వంటి అంశాల్లో ఆరోపణలు, విచారణలు ఎదుర్కొంటున్న ఫేస్బుక్ న్యాయపరమైన అడ్డంకులు ఎదురవ్వచ్చని టెక్ నిపుణలు అంటున్నారు. ఫేస్బుక్ డాటా భద్రతకు సంబంధించి ఫెడరల్ విచారణతో పాటు అమెరికా కాంగ్రెస్‌లో విచారణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సంస్థ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ కాంగ్రెస్ ఎదుట హాజరయ్యారు.
ఫేస్బుక్ సొంత క్రిప్టోకరెన్సీని తయారు చేయటం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థకు, వివిధ దేశాల కరెన్సీలు, యూజర్ల భద్రతకు ముప్పు ఉంటుందన్న వాదనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
"ఇది చాలా రకాలుగా మఖ్యమైన విషయం. ఇప్పుడు కూడా చాలా మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా చాలా మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అలవాటు పడతారు"
- మోషీ కోహెన్, ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ గ్రహీత
ఇదీ చూడండి: అంకురాలకు వాట్సాప్ ఆర్థిక ప్రోత్సాహం