వ్యక్తిగత గోప్యతే ప్రధానాంశంగా ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాలలో ప్రధాన మార్పులు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ప్రకటించింది. ఫేస్బుక్ వార్షిక సమావేశం 'ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్'లో మాట్లాడిన ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్... ఇంటర్ఫేస్తో పాటు పలు ఇతర కీలక మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు.
5వేల మంది డెవలపర్లు పాల్గొన్న ఈ సమావేశంలో.... ఫేస్బుక్లో ప్రైవసీపై ఆందోళనలు ఉన్నాయని జూకర్బర్గ్ ఒప్పుకున్నారు. వీటిని తొలగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
కొత్త డిజైన్...
ఇంటర్ఫేస్ పరంగా కొత్తగా, విభన్నంగా ఉండే 'ఎఫ్బీ 5' డిజైన్‌ను ఆవిష్కరించారు. ఫేస్బుక్ అంటే గుర్తొచ్చే నీలిరంగు ఇందులో ఉండదని చెప్పారు మార్క్.
కొత్త డిజైన్‌లో గ్రూపుల అప్‌డేట్స్‌నూ వాల్‌పై వినియోగదారులు చూడొచ్చు. ఈ సదుపాయం ఫేస్బుక్ యాప్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చినప్పటికీ... కొత్త వెబ్సైట్ కొన్ని నెలల తరువాత వస్తుందని అన్నారు.
భవిష్యత్ అంతా వ్యక్తిగతమే...
భవిష్యత్ అంతా వ్యక్తిగత సందేశాల మయమేనని నమ్ముతున్నట్లు తెలిపారు మార్క్. ఈ దిశగా అన్ని యాప్‌లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.
వ్యక్తిగత సందేశాలు, చిన్న గ్రూపులు, కథనాల ద్వారా ఆన్లైన్లో సమాచార మార్పిడి వేగవంతం అవుతుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రపంచం పెద్దది అవుతూ, కనెక్టివిటీ పెరుగుతున్న వేళ... ఇంతకుముందు కంటే ఎక్కువ గోప్యత అవసరం. కాబట్టి నేను భవిష్యత్ అంతా వ్యక్తిగతమేనని నమ్ముతాను. మా సేవలకు ఇదే కొత్త అధ్యాయం.
- మార్క్ జూకర్బర్గ్, ఫేస్బుక్ సీఈఓ.
సిక్రెట్ కన్వర్జేషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఫేస్బుక్. ఇందులోని సందేశాలకు సంబంధించి సంస్థ వద్ద ఎలాంటి సమాచారాన్ని ఉంచుకోదు.
ఫేస్బుక్లో డేటింగ్...
కొత్తగా డేటింగ్ సదుపాయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది ఫేస్బుక్. ఈ 'ఫేస్బుక్ డేటింగ్' సదుపాయం ప్రస్తుతం 14 దేశాల్లో మాత్రమే ఉంది. ఇందులో 'సీక్రెట్ క్రష్' అనే ఆప్షన్ ద్వారా గ్రూపులలో తగిన జోడీని వెతుక్కోవచ్చు.
మెసెంజర్, వాట్సాప్‌లలో....
మెసెంజర్‌కు కూడా కొత్త డిజైన్‌ను తీసుకురానుంది ఫేస్బుక్. ఇది మరింత వేగంగా, తేలికగా ఉండనుంది.
వాట్సాప్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వారి ఉత్పత్తులను వినియోగదారులు వీక్షించొచ్చు.
వాట్సాప్ పేమెంట్ సౌకర్యం ప్రస్తుతం భారత్‌లో 10 లక్షల వినియోగదారులతో పరీక్షిస్తున్నారు. దీన్ని మరికొన్ని దేశాలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
వీఆర్ హెడ్‌సెట్స్...
కొత్త వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లను విడుదల చేయనుంది ఫేస్బుక్. ఇందులో ఆల్ ఇన్ వన్ వీఆర్ హెడ్ సెట్ 'ఓకులస్ క్వెస్ట్'తో పాటు 'ఓకులస్ రిఫ్ట్ ఎస్'లు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించి ఓకులస్ను ఈ ఏడాది చివర్లో ఆవిష్కరించనుంది.
ఎన్నెన్నో అనుమానాలు...
ఫేస్బుక్ డాటాకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. వ్యక్తిగత వివరాలను ఉపయోగించిన నిర్ణీత ప్రకటనలు ఇవ్వటంపై అనేక అనుమానాలు ఉన్నాయి.
ఇప్పుడు మార్క్ చేసిన ప్రకటనపైనా నిపుణలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు బహిరంగంగా వారికి సంబంధించిన విషయాలు పంచుకోవటానికి ఇష్టపడట్లేదని, దగ్గరి వారు అనుకున్న వారితోనే వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారని చెబుతున్నారు.
ప్రైవేటు వాతావరణంలో ప్రజలు మాట్లాడుకుంటుంటే ఫేస్బుక్, వ్యాపార సంస్థలకు తక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది. దీని వల్ల నిర్ణీత ప్రకటనలు ఇవ్వటం కష్టం అవుతుంది. దీని మీద ఫేస్బుక్ వ్యాపారం ఆధారపడి ఉన్నందున చాలా అనుమానాలు ఉన్నాయి. సమీప భవిష్యత్తులో సమాధానాలు రాకపోవచ్చు. కానీ ఫేస్బుక్ ఒక స్మార్ట్ కంపెనీ. ప్రైవేటు వాతావరణంలో కొత్త రకం ప్రకటనలకు సంబంధించి ఏదైనా టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఉన్నారు.
- దెబ్రా అహో విలియమ్సన్, సోషల్ మీడియా అనలిస్ట్