భారత యూజర్ల సమాచారాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా డాటా కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టిక్ టాక్, హలో యాప్‌ల మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రకటించింది.
'దేశ వ్యతిరేక కార్యకలాపాల' ఆరోపణలతో భారత ప్రభుత్వం టిక్ టాక్, హలో యాప్‌లకు నోటీసులు పంపింది. ప్రభుత్వ నోటీసులకు జులై 22 లోగా సరైన వివరణ ఇవ్వకపోతే నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
"డాటా సంరక్షణ చట్టం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను మేం గుర్తించాం. ఇందులో భాగంగా భారత్‌లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేం ప్రయత్నాలు మొదలు పెట్టాం."
- బైట్ డ్యాన్స్
టిక్ టాక్, హలో యాప్‌లను భారత్‌లో ఆవిష్కరించినప్పటికీ.. వినియోగదారుల సమాచారాన్ని అమెరికా, సింగపూర్‌లో ఉన్న థర్డ్ పార్టీ డాటా కేంద్రాల్లో భద్రపరుస్తున్నట్లు బైట్ డ్యాన్స్ పేర్కొంది.
ఇదీ చూడండి: 'భారత్‌మాలా'కు ఎల్ఐసీ రూ. 1.25 లక్షల కోట్ల రుణం