ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన ఏదైనా కంపెనీ గురించి మాట్లాడినా, ట్విట్ చేసినా వాటి ప్రభావం.. ఆయా సంస్థలపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతకీ విషయమేమిటంటే..
అమెరికాలో 'ఎట్సీ' అనే ఓ ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీ.. బొమ్మలు, ఖరీదైన పాతకాలపు వస్తువులు, సంప్రదాయ అలంకరణ వస్తువుల వంటివి ప్రధానంగా విక్రయిస్తుంటుంది.
అయితే ఎలాన్ మస్క్ తనకు ఆ కంపెనీ చాలా ఇష్టమని ఓ ట్వీట్ చేశారు. ఆ కంపెనీ నుంచి తన కుక్కపిల్లకు ఓ గిఫ్ట్ కూడా కొన్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌తో అమెరికా మార్కెట్లలో 'ఎట్సీ' షేర్లు ఇంట్రాడేలో(జనవరి 26న) రికార్డు స్థాయిలో 8శాతానికిపైగా పెరిగాయి. అయితే చివరకు మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.
రాంగ్ సిగ్నల్..
జనవరి 7న కూడా ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో ‘యూజ్ సిగ్నల్’ అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్ తరహాలో ‘సిగ్నల్’ కూడా ఒక సామాజిక మాధ్యమం. దాన్ని వినియోగించాలని కోరుతూ మస్క్ ఓ సందేశాన్ని ఉంచారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న మదుపర్లు.. ‘సిగ్నల్ అడ్వాన్స్’ అనే పేరు ఉన్న ఓ చిన్న వైద్యపరికరాల తయారీ కంపెనీపై దృష్టి సారించారు. బహుశా దీన్నే మస్క్ ప్రమోట్ చేసి ఉంటారని ఆ కంపెనీ షేర్లపై పడ్డారు. దీనితో ఆ కంపెనీ షేర్ల విలువ జనవరి 7న ఆరింతలైంది. మూడు రోజుల్లో అమాంతం 5,100శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ 390 మిలియన్ డాలర్లకు చేరింది. మస్క్ ట్వీట్‌పై గందరగోళం కొనసాగుతున్నప్పటికీ.. మరుసటి రోజూ సిగ్నల్ అడ్వాన్స్ షేర్లు 885శాతం ర్యాలీ అయ్యాయి.
చివరకు స్వయంగా స్విగ్నల్ యాప్‌కు తమకు ఏ సంబంధం లేదని.. సిగ్నల్ అడ్వాన్స్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇదీ చూడండి:ప్రపంచంలోనే మూడో విలువైన ఐటీ బ్రాండ్‌గా 'టీసీఎస్'