తమ వెబ్సైట్లో 'న్యూస్ ట్యాబ్' పేరుతో నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్. ఇందులో ప్రముఖ వార్తా సంస్థలైన వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్ బజ్ ఫీడ్ న్యూస్, బిజినెస్ ఇన్సైడర్, ఎన్బీసీ, యూఎస్ఏ టుడే, లాస్ ఏంజిల్స్ టైమ్స్ వంటి వార్తా పత్రికల శీర్షికలను అందుబాటులో ఉంచనుంది. పెద్ద నగరాల్లోని స్థానిక వార్తలకూ ఇందులో చోటు కల్పించనుంది. చిన్న పట్టణాల్లోని వార్తలనూ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్.
"ఫేస్బుక్లో జర్నలిజం కోసం ఓ ప్రత్యేక ట్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందులో అత్యంత నాణ్యమైన వార్తలకు చోటు కల్పించనున్నాం. వార్తల్లోని ప్రముఖమైన అంశాలను కూర్చడంలో సహాయపడటానికి అల్గారిథమిక్‌గా మాత్రమే కాక.. జర్నలిజంలో అనుభవమున్న నిపుణులను దీనిలో భాగం చేయనున్నాం. ఫేస్బుక్ ప్రత్యేక ట్యాబ్ ఓ నమ్మకమైన వనరుల నుంచే తీసుకుంటాం. వైవిధ్యమైన వార్తలు ఇందులో ఉండనున్నాయి. విభిన్న దృక్పథాల్లో కథనాలు మీకు అందుబాటులో ఉంటాయి."
-మార్క్ జుకర్ బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
ఈ న్యూస్ ట్యాబ్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆయా పత్రికల వెబ్సైట్లు లేదా యాప్‌ల్లోని వార్తాకథనం వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేసింది ఫేస్బుక్. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని ఎన్నో ఏళ్లుగా వార్తాసంస్థల యాజమాన్యాలు చేస్తున్న అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఫేస్బుక్, గూగుల్... తమ కంటెంట్‌ను పూర్తి ఉచితంగా వాడుకుని, డిజిటల్ యాడ్ల రూపంలో డాలర్లు తీసుకుంటున్నాయని, ఇది తమకు ఎంతో నష్టాన్ని కలిగిస్తోందని వార్తా పరిశ్రమ ఎన్నో ఏళ్లుగా విమర్శలు చేస్తూనే ఉంది.
అందుకే ప్రత్యేకంగా వార్తలు చూసుకునేందుకు వీలుగా 'న్యూస్ ట్యాబ్' సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. అయితే వార్తా పరిశ్రమను నిలబెట్టేందుకు ఫేస్బుక్ నిజంగా కృషి చేస్తుందా అని మీడియా పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది