ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సంపద రికార్డు స్థాయిలో వృద్ధి చెందుతోంది. తాజాగా ఆయన సంపద 7.2 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడం ఇందుకు కారణం. దీనితో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి.. ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు మస్క్.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ పూర్తి సంపద ప్రస్తుతం 127.9 బిలియన్ డాలర్లుగా తేలింది. బిల్‌గేట్స్ మొత్తం సంపద 127.7 బిలియన్ డాలర్లుగా వెల్లడైంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి కరోనా సంక్షోభం మొదలవ్వగా.. ఇదే సమయం నుంచి మస్క్ సంపద రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బ్లూమ్‌బర్గ్ నివేదికలో జనవరిలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఇప్పుడు ఏకంగా 2వ స్థానానికి ఎగబాకారంటేనే సంపద వృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మస్క్ సంపద 100 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ ఎనిమిదేళ్ల చరిత్రలో ఈ స్థాయిలో సంపద పెరిగిన వ్యక్తి మరొకరు లేరు.
ఇదీ చూడండి:ట్రూకాలర్‌కు పోటీగా గూగుల్ కాల్!