ప్రపంచ ప్రఖ్యాత విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అమెరికాలో తన కార్యకలాపాల్ని పునఃప్రారంభించింది. స్థానిక అధికారులు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ.. సీఈఓ ఎలన్ మస్క్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఒకవేళ కంపెనీ పునరుద్ధరణకు అనుమతించకపోతే టెక్సాస్ లేదా నెవడాకు ప్రధాన కార్యాలయాన్ని మారుస్తామని కాలిఫోర్నియా ప్రభుత్వాన్ని హెచ్చరించిన మరుసటి రోజే.. ఆయన కంపెనీని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులు, కార్మికులకు ఆయన లేఖ రాశారు.
- ఇదీ చదవండి: కొడుకు పేరుతో మరోసారి ట్రెండింగ్లో 'మస్క్'
మే 12 నుంచి కంపెనీ సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇది అలమెడా స్థానిక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నామన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలని అధికారులు భావిస్తే తనని మాత్రమే చేయాలని తేల్చి చెప్పారు. కాలిఫోర్నియా గవర్నర్ అనుమతించినప్పటికీ.. అలమెడా అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల భద్రతకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నామన్నారు. కరోనాను నియంత్రణ చర్యలు పాటిస్తామని పేర్కొంటూ.. 37 పేజీలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
- ఇదీ చదవండి: భారత్లో త్వరలో 'టెస్లా' శకారంభం!
మే తొలి వారంలోనే టెస్లా ఉత్పత్తిని పునరుద్ధరించాలని మస్క్ భావించినప్పటికీ.. అక్కడి స్థానిక అధికారులు అందుకు అనుమతించలేదు. ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కార్యకలాపాలను ప్రారంభించకుండా అడ్డుకుంటున్నారని అలమెడా ప్రభుత్వంపై దావా వేశారు. చైనాలో తమ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.