రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. ప్రక్రియను వేగవంతం చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ సమాయత్తమవుతోంది. ఇందుకు తాజాగా బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) విభాగంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది.
ఇందులో భాగంగా వ్యాక్సిన్ ప్రయోగాలపై బీఐఆర్ఏసీ పలు సూచనలు ఇవ్వడం సహా వ్యాక్సిన్ ప్రయోగ కేంద్రాలను కూడా డాక్టర్ రెడ్డీస్ వినియోగించుకునే వీలుంటుంది.
కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం..
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విభాగం బీఐఆర్ఏసీతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని సంస్థ ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. భారత్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను వేగవంతం చేయడంలో వారితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'లింక్డ్ఇన్ ద్వారా నిమిషానికి ముగ్గురు నియామకం'