అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ 'గిలీద్ సైన్సెస్'తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు భావిస్తున్న రెమ్డెసివిర్ రిజిస్ట్రేషన్, తయారీ, మార్కెటింగ్ కోసం ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.
127 దేశాల్లో రెమ్డెసివిర్ తయారీ, మార్కెటింగ్... ఈ 'నాన్ ఎగ్జిక్యూటివ్ లైసెన్సింగ్' ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది రెడ్డీస్ ల్యాబ్స్.
ఈ ఒప్పందంతో రెమ్డెసివిర్ తయారీకి కావాల్సిన సాంకేతికతను గిలీద్.. రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు బదిలీ చేస్తుంది. అయితే వివిధ దేశాల్లో ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని రెడ్డీస్ ల్యాబ్స్ పేర్కొంది.