ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు టెలికాం శాఖ మరో షాకిచ్చింది. రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీ తిరస్కరించిందన్న ఆరోపణలపై ఈ కంపెనీలకు రూ.3,050కోట్ల జరిమానా విధించగా .. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా చెల్లించాలని తాజాగా ఆ కంపెనీలకు డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ నెట్‌వర్క్‌తో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు ఇంటర్ కనెక్టివిటీను నిలిపివేశాయని ఆ మధ్య ఆరోపణలొచ్చాయి. జియో వినియోగదారులు ఆ నెట్‌వర్క్‌లకు చేసిన 75 శాతం కాల్స్ తిరస్కరణకు గురవుతున్నాయని అప్పట్లో జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో చర్యలు చేపట్టిన రెగ్యులేటరీ అథారిటీ.. తొలుత ఈ టెలికాం సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని భావించింది. అయితే కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించి ఈ సంస్థలకు జరిమానా విధించాలని నిర్ణయించింది.
ఏ కంపెనీకి ఎంత?
ఈ మేరకు ఎయిర్‌టెల్‌కు రూ. 1050కోట్లు, వొడాఫోన్‌కు రూ. 1050 కోట్లు, ఐడియాకు (ఇప్పుడు వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమయ్యాయి) రూ. 950కోట్ల జరిమానా విధించాలని 2016 అక్టోబరులో ట్రాయ్.. టెలికాం శాఖకు సిఫార్సు చేసింది. దీంతో టెలికాం శాఖ ఈ సంస్థలకు జరిమానా విధించింది. దీనిపై ఆయా కంపెనీలు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ను ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
2019 జులైలో ఈ కమిషన్ కూడా జరిమానాను ఆమోదించింది. అయితే ఇప్పటివరకు ఈ సంస్థలు పెనాల్టీ చెల్లించకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన టెలికాం శాఖ.. గురువారం వాటికి డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మూడు వారాల్లోగా ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.
కోర్టుకు వెళ్తాం: ఎయిర్‌టెల్
అయితే.. టెలికాం శాఖ జరిమానాపై కోర్టుకు వెళ్తామని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 'జరిమానా విధించడంపై మేం అసంతృప్తిగా ఉన్నాం. మాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. చట్టాలకు లోబడే మేం పనిచేస్తాం. నిబంధనలను ఎన్నడూ అతిక్రమించలేదు. ఈ డిమాండ్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తాం' అని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై వొడాఫోన్ ఐడియా ఇంకా స్పందిచలేదు.
ఇదీ చదవండి: Air India news: 'ఎయిర్ ఇండియా' వార్తలను ఖండించిన ప్రభుత్వం..!