2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆధార్ ఆధారంగా పని చేసే ఈ-కేవైసీ వినియోగం, డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
"బెంచ్‌మార్కింగ్ ఇండియా పేమెంట్స్ సిస్టమ్" పేరుతో భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక... దేశంలో డిజిటల్ లావాదేవీల వృద్ధిపై పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది.
నాలుగేళ్లలో 50 శాతం
నోట్ల రద్దుతో చిల్లర వ్యాపారులు, వినియోగదారుల మధ్య డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. గత నాలుగేళ్లలో లావాదేవీలు 50 శాతం వృద్ధి చెందాయి. 2018-19లో ఈ లావాదేవీలు మరింత వృద్ధి చెందినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది.
వేగంగా లావాదేవీలు జరిపేందుకు తీసుకువచ్చిన యూనీఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగమే ఇందుకు కారణమని వివరించింది.
స్మార్ట్ఫోన్ల వినియోగమూ కారణమే
దేశంలో గత కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ల వినియోగదార్లు గణనీయంగా పెరిగారు. ఫలితంగా ఈ-మనీ, యూపీఐ ఆధారిత లావాదేవీలు వృద్ధి చెందాయి. ఈ-మనీ, యూపీఐ, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్ సిస్టమ్, రూపే, భారతీ బిల్ పేమెంట్ సిస్టమ్‌ల వినియోగం వల్ల డిజిటల్ లావాదేవీల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని నివేదిక పేర్కొంది.
అధికారిక గణాంకాల ప్రకారం.. 2017లో భారత్‌లో 3,459 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. జపాన్, అమెరికా తర్వాత ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరిగిన దేశం భారత్ కావడం విశేషం.
కార్డుల సంఖ్య పెరిగింది
2012 చివరి నాటికి 331.60 డెబిట్‌కార్డులు, 19.55 మిలియన్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. 2017 చివరి నాటికి వీటి సంఖ్య భారీగా వృద్ధి చెంది వరుసగా 861.7 మిలియన్లు, 37,49 మిలియన్లకు చేరినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది.
తాజా గణాంకాల ప్రకారం 2019 మార్చి 31 నాటికి 925 మిలియన్ల డెబిట్ కార్డులు.. 47 మిలియన్ల క్రెడిట్ కార్డులు జారీ అయినట్లు ఆర్బీఐ తెలిపింది.
డిజిటల్ లావాదేవీల వృద్ధికి లావాదేవీల రుసుములు నిరోధకంగా ఉన్నట్లు పేర్కొంది నివేదిక.
ఇదీ చూడండి: రూ.50 కోట్ల టర్నోవరు ఉంటేనే ఈ-బిల్లు!