దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించి.. ఆర్థిక వృద్ధిని పెంచేందుకు కార్పొరేట్ సుంకాల తగ్గింపు అవసరమని ప్రభుత్వం ముందుగానే గ్రహించిందని ముఖ్య ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్ అన్నారు.
గత కొన్ని త్రైమాసికాల నుంచి వృద్ధి.. అంతకు ముందున్నంత వేగంగా లేదని.. కార్పొరేట్ సుంకాలు పెట్టుబడులకు చాలా ముఖ్యమైన అంశమని ఆయన తెలిపారు.
"ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతను పెంచేందుకు పెట్టుబడి ప్రధాన సాధనం. ఉత్పాదకత పెరిగితే.. వేతనాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎగుమతులూ వృద్ధి చెందుతాయి. ఇవన్నీ వినియోగదారుల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. 7 శాతం వృద్ధితో కొనసాగిన మనం.. గత కొన్ని త్రైమాసికాలుగా ఆ స్థాయిలో వృద్ధి సాధించడం లేదు. ఈ కారణంగా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం కష్టంగా మారింది."
- కె.వి.సుబ్రమణియన్, ముఖ్య ఆర్థిక సలహాదారు
దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో 5 శాతానికే పరిమితమైంది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి.
వృద్ధి మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే సెప్టెంబర్లో కార్పొరేట్ సుంకాన్ని 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది.
కొత్తగా తయారీ రంగంలోకి వచ్చిన కంపెనీలకు.. పన్ను రేటును 15 శాతానికి తగ్గించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి:ఫేస్బుక్ సేవలకు అంతరాయం- నెటిజన్ల అసహనం