కొవిడ్ టీకా 'కొవాగ్జిన్'ను 30 రోజుల్లో 30 నగరాలకు సరఫరా చేసినట్లు ప్రకటించింది భారత్ బయోటెక్. కరోనా వల్ల సంస్థ ఉద్యోగుల్లో కొంత మంది సెలవుల్లో ఉన్నప్పటికీ దీనిని సాధించినట్లు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, సంయుక్త ఎండీ సుచిత్రా ఎల్లా తెలిపారు.
"కొవాగ్జిన్ 30 రోజుల్లో ముప్పై నగరాలకు చేరుకుంది. లాక్డౌన్ ఉన్నప్పటికీ మా ఉద్యోగులు 24x7 పని చేస్తున్నారు. కరోనా కారణంగా కొంత మంది క్వారంటైన్, సెలవుల్లో ఉన్నారు."
- సుచిత్రా ఎల్లా, భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ.
ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేయడంలో భాగంగా.. అమృత్సర్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ఎర్నాకులం, జైపూర్, హైదరాబాద్, కాన్పూర్, కోల్‌కతా, గువాహటి, మైసూర్, పుణె, రాయ్‌పుర్, మెహాళీ, విజయవాడ వంటి నగరాలకు టీకాలు పంపినట్లు తెలిపారు సుచిత్రా ఎల్లా.
గుజరాత్ అంక్లేశ్వర్‌లోని తమ సబ్సిడరీ కంపెనీ అయిన 'చిరాన్ బెహ్రింగ్ వ్యాక్సిన్స్'లో అదనంగా 20కోట్ల టీకాలను ఉత్పత్తి చేయనున్నట్టు గత వారమే భారత్ బయోటెక్ ప్రకటించడం గమనార్హం.
ఇదీ చదవండి:'కొవాగ్జిన్ అనుమతికి మరింత సమాచారం కావాలి'