ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన చర్యల్లో భాగంగా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించే నిర్ణయం చారిత్రకమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్‌ను వ్యాపారానికి అత్యంత అనుకూల దేశంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం గత కొన్ని వారాలుగా అనేక దిద్దుబాటు ప్రకటనలు చేసినట్లు ట్వీట్ చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను మెరుగుపరుస్తాయన్నారు మోదీ. ఈ ప్రకటనతో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అంచనాలు మెరుగుపడతాయని తెలిపారు.
"కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చారిత్రకం. మేక్ ఇన్ ఇండియాకు గొప్ప ఊతమిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన దేశంలోని ప్రైవేటు సెక్టార్లో పోటీతత్వాన్ని పెంచుతుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. "
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.
ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవటం, నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవటం వల్ల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. దేశీయ కంపెనీలకు 25.17 నుంచి 10 శాతానికి కార్పొరేటు పన్నును తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ ప్రకటన చేశారు.
ఇదీ చూడండి: దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు:నిర్మల