భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ)... పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. బ్యాంకుపై ఫోరెన్సిక్ ఆడిట్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ)తో సమావేశం ముగిసిన అనంతరం ఈ విషయాలు తెలిపారు దాస్.
దేశంలోని 10 ప్రధాన సహకార బ్యాంకుల్లో పీఎంసీ ఒకటి. ఆరు నెలల నుంచి భారీగా రుణాలు పేరుకుపోయిన కారణంగా సెప్టెంబర్లో పీఎంసీ పర్యవేక్షణను ఆర్బీఐ తీసుకుంది. హెచ్డీఐఎస్ అనే మౌలిక వసతుల కల్పన సంస్థకు ఇచ్చిన రుణాలతో.. రూ.4,355 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించింది.
ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు నగదు ఉపసంహరణపై పరిమితులు విధించింది ఆర్బీఐ. తొలుత ఈ పరిమితిని రూ.40,000గా నిర్ణయించింది. తాజాగా రూ.50,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పీఎంసీ కుంభకోణం కేసులో.. హెచ్డీఐఎల్ ప్రమోటర్లు రాకేశ్, సారంగ్, వాద్వాన్ సహా మొత్తం అయిదుగురును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పీఎంసీ కుంభకోణం బయటపడటం కారణంగా.. ఆ బ్యాంకు ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. దాదాపు 10 మంది మనస్తాపంతో మృతి చెందారు. బాధితులంతా తమకు న్యాయం చేయాలంటూ ఆర్బీఐ ఎదుట పలు మార్లు నిరసనలకు దిగారు.
ఇదీ చూడండి: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడనుందా?