సంక్షోభ సమయంలో కొత్త అంకుర సంస్థలను స్థాపించడానికి ఇదే సమయమని వ్యాపార వేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే తక్కువ పెట్టుబడులతో భారీ లాభాలు ఆర్జించే పరిశ్రమలకు బీజం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత కరోనా సంక్షోభం కూడా భారత్‌కు అలాంటి అవకాశాన్నే కల్పించింది. మరి మన దేశం ఈ అవకాశాన్ని ఏ మేర అందిపుచ్చుకుంటుందో...
భారత్‌కు వరం
పొరుగు దేశం చైనాలోని వుహాన్‌లో గతేడాది చివర్లో నావెల్ కరోనా వైరస్ పురుడు పోసుకుంది. నగరమంతా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ చిధ్రం అయ్యాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోతున్నారు. వైరస్‌ను కట్టడి చేయడం, మహమ్మారి సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడంలో చైనా విఫలమైంది! ఇదే అదనుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. కటువుగా నిందిస్తున్నారు. వాణిజ్య యుద్ధం సమయంలోనే ఆ దేశం నుంచి కొన్ని కంపెనీలు వియత్నాంకు వెళ్లిపోయాయి. వైరస్ విషయంలో అనేక దేశాలకు చైనాపై అనుమాలు పెరగడంతో దానిపై అతిగా ఆధారపడొద్దని నిర్ణయానికి వచ్చేశాయి! సరఫరా గొలుసులో వైవిధ్యానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నాయి. ఇది భారత్‌కు వరంగా మారనుంది!
చైనాపై ఆధారపడొద్దని..
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ చైనా. అనేక దేశాల పెట్టుబడిదారులు అక్కడ ఎన్నో తయారీ కర్మాగారాలను స్థాపించారు. తేలిగ్గా భూమి లభించడం, సులువైన కార్మిక చట్టాలు, వేతనాల భారమూ తక్కువే కావడం ఆ దేశానికి కలిసొచ్చింది. ఇక నిపుణుల వేతనాలు ఎక్కువేం కాదు. చట్టాల్లో సంస్కరణలు అమలు చేశాకే ఆ దేశం అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. వైరస్ దెబ్బకు ఇప్పుడు అనేక దేశాలు, సంస్థలు డ్రాగన్‌పై అతిగా ఆధారపడొద్దని భావిస్తున్నాయి. అక్కడి నుంచి వ్యాపారాలను తరలించేందుకు జపాన్ ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్లను ప్రకటించింది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లోకి తరలించి సరఫరా గొలుసులో వైవిధ్యం పెంచాలని అనుకుంటోంది. ఐరోపా కూటమి దేశాల ఆలోచన సైతం ఇదే. అమెరికా, చైనా మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పులా మారడంతో యూఎస్ పెట్టుబడిదారులూ మార్పు కోరుకుంటున్నారు.
వెయ్యి కంపెనీలతో చర్చలు
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు! ఇప్పుడు మాత్రం వదులుకొనే ప్రసక్తే లేదు. చైనా నుంచి తరలించాలని భావిస్తున్న అమెరికా కంపెనీలను ఆకర్షించే పనిలో నిమగ్నమైంది. అబ్బాట్ లేబొరేటరీస్ సహా ఎన్నో సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్నింటికి భారత్‌లో వ్యాపార ఉనికీ ఉంది. ఏప్రిల్ నెలలో వెయ్యికి పైగా అమెరికా కంపెనీలను దౌత్య అధికారుల ద్వారా భారత్ సంప్రదించింది. పొరుగు దేశం నుంచి తరలించే తయారీ కంపెనీలకు భారీయెత్తున ప్రోత్సాహకాలు, మినహాయింపులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. పన్నులు, కార్మిక చట్టాలు, భూసేకరణ నిబంధనల్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొందని సమాచారం. వైద్య పరికరాలు, ముడి ఔషధాలు, ఆహార ప్రాసెస్ యూనిట్లు, టెక్స్‌టైల్స్, తోలు, వాహన విడిభాగల తయారీ సహా 550+ ఉత్పత్తుల తయారీదారులతో చర్చించిందని విశ్వసనీయ సమాచారం.
పన్నులు, చట్టాల్లో మార్పులు
అమెరికా, జపాన్, ఐరోపా దేశాల్లో తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ఖర్చుతో కూడుకున్న పని. అదే భారత్‌లో తక్కువ వేతనాలకే నిపుణులు, కార్మికులు దొరుకుతారు. చైనాతో పోలిస్తే ఖర్చు కొద్దిగా ఎక్కువే అయినా మిగతా దేశాలకన్నా తక్కువేనని వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చట్టాలను సులభతరం చేయడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నాయి. ఈ-కామర్స్ సంస్థల కోరిక మేరకు డిజిటల్ లావాదేవీలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను వాయిదాకు అంగీకరించిందట. ట్రంప్ కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతికి అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.130 బిలియన్ పెట్టుబడులను ఆమోదించింది. జీడీపీలో 15%గా ఉన్న తయారీ రంగ వాటాను 2022కు 25 శాతానికి పెంచేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని తెలిసింది. చైనా స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలతో చర్చించారు. దాదాపు 4 లక్షల హెక్టార్ల భూమిని సిద్ధం చేసింది.
వదలుకోవద్దని పట్టుదల
చైనాపై ఆధారపడకుండా సరఫరా గొలుసును పునర్ నిర్మించేందుకు భారత్, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాంతో చర్చిస్తున్నట్టు అమెరికా మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఇందులో భారత్, వియత్నాంకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాండ్ కార్పొరేషన్ పరిశోధకుడు డెరెక్ గ్రాస్‌మన్ అన్నారు. సంస్కరణలు చేపడితే మరిన్ని అనుకూలతలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇప్పటికీ చైనాలో ఖర్చులు తక్కువే అయినా అన్ని గుడ్లను ఒకే బుట్టలో వేయొద్దన్న సామాన్య నీతిని కంపెనీలు పాటించాలని భావిస్తున్నాయి. వెంటనే మోదీ ప్రభుత్వం స్పందించడం మొదలుపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. ఎస్బీఐ రుణాలు మరింత చౌక!