దేశీయ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ కొనుగోళ్ల పరంపర కొనసాగిస్తోంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'గ్రేట్ లెర్నింగ్' యాప్‌ను సొంతం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో బైజూస్ ఉన్నత విద్యా రంగంలోకి కూడా ప్రవేశించనట్లయింది.
ఈ లావాదేవీ విలువ 600 మిలియన్ డాలర్లని తెలిసింది. ఈ మొత్తాన్ని కొంత నగదు రూపంలో, మరికొంత స్టాక్‌లు, ఎర్న్‌ఔట్‌ల రూపంలో చెల్లించనుంది బైజూస్. ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు అందించే సేవల్లో మరింత వృద్ధి సాధించేలా రానున్న రోజుల్లో గ్రేట్ లెర్నింగ్‌పై 400 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు బైజూస్ వివరించింది. గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేసినప్పటికీ.. తమ ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థగానే కొనసాగనుందని బైజూస్ స్పష్టం చేసింది.
చిన్న పిల్లల విభాగంలోకి ఇటీవలే ఎంట్రీ...
అమెరికాకు చెందిన 'ఎపిక్'ను కూడా 500 మిలియన్ డాలర్లతో ఇటీవలే కొనుగోలు చేసింది బైజూస్. ఎపిక్.. చిన్న పిల్లలు ఆన్లైన్లో పుస్తకాలు చదువుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల ఉపాధ్యాయులు, 5 కోట్ల మంది పిల్లలు వినియోగదారులుగా ఉన్నారు. 40,000కి పైగా విశేష ఆదరణ పొందిన పుస్తకాలు ఎపిక్ ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉన్నాయి.