కరోనా మహమ్మారి దిగ్గజ సంస్థలనూ సంక్షోభంలోకి నెడుతోంది. కొవిడ్-19తో నెలకొన్న పరిస్థితుల కారణంగా టెక్ దిగ్గజం యాపిల్ 2020 జనవరి-మార్చి త్రైమాసికం లాభాలు 2 శాతం తగ్గినట్లు ప్రకటించింది. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలానికి 11.2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. అయితే సంస్థ ఆదాయం మాత్రం 1 శాతం పెరిగి 58.3 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. యాపిల్ డివైజ్ల విక్రయాలు గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 7 శాతం తగ్గినట్లు పేర్కొంది.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్పత్తి కేంద్రాలు, వందలాది రిటైల్ స్టోర్లు మూతపడ్డాయని.. ఈ కారణంగానే లాభాలు తగ్గాయని యాపిల్ పేర్కొంది. తదుపరి త్రైమాసికంలో మరింత క్షీణత నమోదవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కఠిన పరిస్థితులు..
"2007, 2009 మహాసంక్షోభాల కారణంగా కంపెనీ ఎదుర్కొన్న గడ్డుకాలంతో పోలిస్తే ఈసారి పరిస్థితులు ఇంకా చాలా కఠినంగా ఉన్నాయి." -టిమ్ కుక్, యాపిల్ సీఈఓ
'చైనాలో ప్రస్తుతం యాపిల్ స్టోర్లు తిరిగి సాధారణంగా పని చేస్తున్నాయి. అయితే కొన్ని రోజులు స్టోర్లు మూతపడటం ఒడుదొడుకులు సృష్టించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్టోర్లు మూతపడే ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఐఫోన్ కొత్త మోడళ్ల విడుదల ఆలస్యం కావచ్చు' అని సంస్థ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
బైబ్యాక్, డివిడెండు..
ఇలాంటి పరిస్థితుల్లో 90 బిలియన్ డాలర్లతో సొంత షేర్లను బైబ్యాక్ చేయాలని యాపిల్ యోచిస్తోంది.
ఫలితాలు ప్రకటించిన తర్వాత యాపిల్ షేర్లు 2 శాతం మేర క్షీణించాయి.
అమెజాన్ లాభాల్లో భారీ క్షీణత...
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాలు భారీగా తగ్గినట్లు ప్రకటించింది. అయితే కరోనా కారణంగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించింది. ప్యాకింగ్ సహా ఇతర నిర్వహక ఖర్చులు పెరగటం లాభాల తగ్గుదలకు కారణమైనట్లు వివరించింది.
రెండో త్రైమాసికంలో డెలివరీల వేగం పెంచడం సహా సిబ్బంది రక్షణ కోసం 4 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వెల్లడించారు.
ఫలితాలు ఇలా..
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెజాన్ నికర ఆదాయం 2.54 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే సమయంలో ఆ మొత్తం 3.56 బిలియన్ డాలర్లు.
పూర్తి ఆదాయం 2020 తొలి త్రైమాసికంలో 75.45 బిలియన్ డాలర్లు.
ఇదీ చూడండి:'ఈఎంఐల వాయిదాపై మీ ఉద్దేశం సాకారమవ్వాలి'