అమెరికాకు చెందిన లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్ గత ఏడాది చివరి త్రైమాసికంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2019 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 22 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని గడించింది. ఈ సమయంలో సంస్థ ఆదాయం 91.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు యాపిల్ తెలిపింది.
"గతంలో ఎన్నడూ లేనంతగా లాభాలు ప్రకటించడం ఆశ్యర్యంగా అనిపిస్తోంది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మోడళ్లకు, యాపిల్ సేవలకు, ఇతర గాడ్జెట్లకు రికార్డు స్థాయిలో డిమాండు రావడం.. ఈ లాభాలకు కారణం." -టిమ్‌కుక్, యాపిల్ సీఈఓ
ఆదాయం ఇలా..
గత ఏడాది డిసెంబర్ నాటికి ముగిసిన త్రైమాసికంలో యాపిల్‌కు ప్రధాన ఆదాయ వనరు ఆయిన ఐఫోన్ల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగింది. ఈ సమయంలో సంస్థ 55.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.
సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 2019 డిసెంబర్ త్రైమాసికంలో 17 శాతం వృద్ధితో 12.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది యాపిల్ టీవీ ప్లస్ పేరుతో 100కు పైగా దేశాల్లో ఆవిష్కరించిన ఆన్ డిమాండ్ వీడియో సేవల కారణంగా ఈ వృద్ధి నమోదైంది.
హోంపాడ్ స్పీకర్స్, యాపిల్ వాచ్ సహా ఇతర గాడ్జెట్లు, గృహోపకరణాల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 37 శాతం పెరిగి.. మొత్తం 10 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు యాపిల్ తెలిపింది.