ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబం, మిత్రులతో గడిపే సమయమే దొరకడం లేదు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. వృత్తిపరంగా రాణిస్తేగాని జీవితంలో రాణించలేం. ఈ రెండింటినీ సమతుల్యంగా నడిపిస్తేగానీ మనం అభివృద్ధి చెందలేం. ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ఓ సర్వే. వృత్తిలో రాణించాలంటే.. ఉద్యోగ, వ్యక్తిగత జీవిత సమతుల్యమే కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఇది సదరు వ్యక్తి ఒత్తిడిని తగ్గిస్తుందని సర్వే వెల్లడించింది.
గ్లోబల్ రిక్యూట్మెంట్ స్పెషలిస్ట్-మైకేల్ పేజ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం ఆధునిక కాలంలో వ్యక్తులు వ్యక్తిగత, వృత్తి, కుటుంబ జీవితంలో సమతుల్యత సాధించడం రోజూ పెద్ద సమస్యలా తయారైంది.
ఒత్తిడితోనే ఉద్యోగం!
భారతదేశ వ్యాప్తంగా వివిధ ఉన్నతస్థాయి రంగాల్లోని 585 మంది మిలీనియల్స్పై(జనరేషన్-వై అంటే 1980-90ల మధ్య పుట్టినవారు) అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. ఉద్యోగ బాధ్యతలు, యజమాని-ఉద్యోగి మధ్య సంబంధాలు, ఇతర కారణాలు... ఉద్యోగి ఉత్పాదకత మీద ప్రభావం చూపుతాయని నివేదికలో పేర్కొన్నారు.
ఉద్యోగం పోతుందనే భయంతో, తీవ్రమైన ఒత్తిడితో అధిక సమయం పని చేస్తున్నారనీ సర్వే స్పష్టం చేసింది. అటువంటి సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడం ఉద్యోగికి అలాగే సంస్థకు క్లిష్టమైన అంశమేనని మైఖేల్ పేజ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ మోహిత్ భర్తీ తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లోనే...
సర్వే ప్రకారం... సగటున 92 శాతం మంది కార్యాలయాల వద్ద వ్యక్తిగత విషయాలకు గంట కంటే తక్కువ సమయమే కేటాయిస్తున్నారట. 65 శాతం ఉద్యోగులు.. కుటుంబ సభ్యులు, మిత్రులతో సామాజిక మాధ్యమాల్లో సంబంధాలు కొనసాగిస్తున్నారని, 27 శాతం మంది వ్యక్తిగత ఈ-మెయిల్స్ పంపుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
ఏదైనా చేయగల నైపుణ్యం ఉండాలి!
ఉద్యోగానికి తగ్గట్లు ఉండటం ముఖ్యమని పదిలో తొమ్మిది మంది చెప్పినట్లు సర్వే వెల్లడించింది. 60 శాతం మంది ఇది వారికి మంచి ఉద్యోగ, జీవిత సమతుల్యతను ఇస్తుందని సూచించగా, 34 శాతం మంది వృత్తిపరమైన ఉత్పాదకతను పెంచుతుందని పేర్కొన్నారు.
కంపెనీలు ఉద్యోగి నిబంధనలను మార్చేస్తున్నాయి!
భారత్లోని వివిధ కంపెనీలు ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించి, కార్యాలయంలో ఆరోగ్య వాతావరణాన్ని కల్పించడం కోసం ఉద్యోగి విధివిధానాల్లో మార్పులు చేయడం మొదలు పెట్టాయని సర్వే పేర్కొంది. 'ఉత్పాదకత పెరిగి.. అధిక ఉత్పత్తి సాధించాలంటే పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కంటే అనుసంధానం చేయడం మంచిదని' భర్తీ వెల్లడించారు.
ఇదీ చూడండి: పద్దు 2020: 'ప్రభుత్వ వ్యయాలు పెంచడమే వృద్ధికి పరిష్కారమా'