అగ్రశ్రేణి వైద్యసేవల సంస్థ అయిన అపోలో హాస్పిటల్స్ కరోనా వైరస్‌పై పోరాటానికి 'ప్రాజెక్టు కవచ్'ను ఆవిష్కరించింది. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావటం, శక్తియుక్తులను బలోపేతం చేయడం, ప్రణాళికాబద్ధంగా స్పందించడం, బాధితులకు అన్ని రకాలుగా వైద్యసేవలు అందించడం... ఈ ప్రాజెక్టు లక్ష్యమని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వెల్లడించారు.
దాదాపు నెలరోజుల పాటు పూర్తిస్థాయిలో కరోనా వైరస్‌పై పోరాటానికి అవసరమైన వనరులు సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. భవిష్య తరాల మీదా ప్రభావం చూపే సమస్య కనుక అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడి గెలవాలని కోరారు. ప్రభుత్వాలకు ప్రాజెక్టు కవచ్ ద్వారా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
కృత్రిమ మేధస్సు ఆధారిత 'రిస్క్ అసెస్‌మెంట్ స్క్రీనింగ్'ను తొలిదశ పరీక్షల కోసం సిద్ధం చేసినట్లు అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శోభనా కామినేని వివరించారు. 6 భాషల్లో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని అపోలో ఫార్మసీల్లో మందులు, వైద్య ఉపకరణాలు, సప్లిమెంట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచామని, ఆర్డరుపై ఇళ్లకే మందులు సరఫరా చేసే యంత్రాంగాన్ని బలోపేతం చేసినట్లు వివరించారు.
ప్రాజెక్టు స్టే- ఐ
కొవిడ్-19 నిర్ధరణకు అపోలో హాస్పిటల్స్‌లోని రోగ నిర్ధరణ కేంద్రాలు అనుమతులు పొందాయని, అనుమానితులకు ఇళ్ల వద్దే శాంపిల్స్ సేకరించి పరీక్ష ఫలితాలు తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ సంయుక్త ఎండీ సంగీతారెడ్డి తెలిపారు. బాధితుల సంఖ్య పెరిగితే, ఆసుపత్రుల్లో పడకల కొరత ఎదురు కావచ్చని, దీన్ని దృష్టిలో పెట్టుకుని హోటళ్లు, హాస్టళ్లలోని గదులను ఆసుపత్రి గదులుగా మార్చేందుకు వీలుకల్పించే 'ప్రాజెక్టు స్టే- ఐ' ను రూపొందించినట్లు సంగీతారెడ్డి చెప్పారు. దీనివల్ల ఎక్కడి వారిని అక్కడే క్వారంటైన్ చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఇటువంటి మెడికల్ రూములను చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగుళూరు, దిల్లీలలో, ఒక్కో నగరంలో 50 గదుల చొప్పున ఏర్పాటు చేసి, తర్వాత అవసరాన్ని బట్టి పెంచుతామని అన్నారు. ఇటువంటి గదులు దేశవ్యాప్తంగా దాదాపు 5,000 వరకు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఉచిత ఆన్‌లైన్ కొవిడ్-19 కోర్సు
బాధితులకు వైద్య సపర్యలు చేయడం కోసం తగిన శిక్షణ పొందిన మానవ వనరులు అవసరమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఉచిత ఆన్‌లైన్ కొవిడ్-19 కోర్సు’ ఆవిష్కరించినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూపు వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. దీనికింద ఇప్పటికే 50 వేల మందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేశాయని, వాటికి నిర్ధారిత ప్రమాణాల ప్రకారం పడకలు సరఫరా చేసేందుకు అపోలో హాస్పిటల్స్ చేయూతనిస్తోందని వెల్లడించారు.
ఇదీ చూడండి: వెంటిలేటర్ల తయారీలో మహీంద్రా తొలి అడుగు