భారత్‌లో ఉన్న ఎక్కువమంది వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని.. అమెజాన్ ఇండియా మెరుగైన సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. తమ స్వయంచాలక మెసేజింగ్ అసిస్టెంట్ ఇకనుంచి హిందీలోనూ సేవలు అందించనుంది.
లక్షలాది మంది అమెజాన్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం హిందీనే తొలి భాషా ప్రాధాన్యంగా ఎంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకుంది మార్కెటింగ్ దిగ్గజం. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో సంభాషించాల్సిన అవసరం లేకుండానే.. ఇలా ఫిర్యాదుల్ని సులువుగా, వేగంగా పరిష్కరించవచ్చని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
భాషా ఇబ్బందుల్ని అధిగమిస్తాం...
కృత్రిమ మేధ పరిజ్ఞానంతో సంభాషణలు సజావుగా, స్నేహపూర్వకంగా సాగేందుకు అమెజాన్ అసిస్టెంట్ ఉపయోగపడుతుందని తెలిపింది సంస్థ. భాషా అవరోధాల్ని ఈ అమెజాన్ మెసేజింగ్ అసిస్టెంట్ హిందీ సేవలతో... అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.
''ఈ నూతన మెసేజింగ్ అసిస్టెంట్ సేవలతో కొత్తగా మరో 10 కోట్ల మంది వినియోగదారులకు చేరువ కావొచ్చు'' అని అంచనా వేశారు అమెజాన్ ఇండియా వినియోగదారుల సేవల డైరెక్టర్ అక్షయ్ ప్రభు.
ఇదీ చూడండి: అదిరే ఫీచర్లు, సూపర్ ఆఫర్లతో 'జియో గిగా ఫైబర్'